Twitter : అందుకే రాహుల్ ట్విట్టర్ అకౌంట్ లాక్

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకి తెలిపింది.

Twitter : అందుకే రాహుల్ ట్విట్టర్ అకౌంట్ లాక్

Rahul2

Twitter ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేసినట్లు ఢిల్లీ హైకోర్టుకి తెలిపింది. రాహుల్ షేర్ చేసిన హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల దళిత బాలిక కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను, దానికి సంబంధించిన ట్వీట్ ను షేర్ చేసి రాహుల్ తమ పాలసీని ఉల్లంఘించాడని ట్విట్టర్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకి తెలిపింది. దీంతో రాహుల్ షేర్ చేసిన ఫొటోలు, ట్వీట్ ని తొలగించడంతో పాటు ఆయన ట్విట్టర్ అకౌంట్ ని ఆగస్టు-6 నుంచి తాత్కాలికంగా లాక్ చేసినట్లు కోర్టుకు ట్విట్టర్ తెలియజేసింది. అయితే ట్విటర్‌ ఇండియాను ఇందులోకి పిటిషనర్‌ అవవసరంగా లాగారని పేర్కొంది.

కాగా,ఢిల్లీలోని దళిత బాలిక హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేలా ట్వీట్‌ చేసిన రాహుల్‌ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ట్విటర్‌ ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 27కి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.

రాహుల్ చేసిన తప్పేంటీ
ఆగస్ట్ 1న నైరుతి ఢిల్లీలోని ఓ శ్మశానవాటిక వద్ద ఓ దళిత బాలికను రేప్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఆగస్టు-2న బాధిత కుటుంబాన్ని రాహుల్ కలిశారు. తన కారులో కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అయితే, అత్యాచారం కేసుల్లో బాధితుల వివరాలు బయటకు తెలిసేలా వ్యవహరించకూడదు. బాలిక హత్యాచారం కేసులో బాధితుల కుటుంబ సభ్యుల వివరాలను బయటి ప్రపంచానికి తెలిసేలా రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారంటూ ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. జువైనల్‌, పోక్సో చట్టాలను రాహుల్‌ ఉల్లంఘించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో రాహుల్‌పై చర్యలకు జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆదేశించాలని, రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.

కాగా,ట్విట్టర్ లాక్ అవడంతో ప్రస్తుతం రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా మోదీ సర్కార్ పై రాహుల్ విమర్శలు గుప్పిస్తున్నారు.