Turmeric Cultivation : పసుపు సాగులో విత్తన శుద్ధి..

రైతులు సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతున్నారు. బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకం, అపోహతో దొడ్డు విత్తనాన్ని,

Turmeric Cultivation : పసుపు సాగులో విత్తన శుద్ధి..

Turmeric Cultivation : భారతదేశంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు ప్రధానమైనది. మన దేశంలో సగానికి సగం పసుపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ నుండి ఉత్పత్తవుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగుచేసినప్పటికీ వివిధ కారణాల వల్ల రాబడి తగ్గడం రైతులను కోలుకోనీయకుండా చేస్తోంది. అందులో రకాల ఎంపిక, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, విత్తుకునే పద్ధతి, ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణా చర్యలు వంటి అంశాలపైన జాగ్రత్త వహిస్తే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది.

20-35 డిగ్రీల సెల్సియస్ మరియు వెచ్చని తేమతో కూడిన వాతావరణం ఉన్న ప్రాంతాలలో పసుపు బాగా పండుతుంది. ఇది సగటు సముద్ర మట్టం నుండి సముద్ర మట్టానికి 1500 మీటర్ల వరకు ఎక్కడైనా పెరుగుతుంది. ఇది బాగా సేద్యం చేయబడితే అది మరింత ఎత్తులో పెరుగుతుంది. దీనికి అనువైనది ఇసుక లేదా బంకమట్టి లోమ్ నేలలు, ఇవి బాగా సేద్యం చేయబడతాయి, అయితే రాతితోకూడిన లేదా భారీ బంకమట్టి నేలలు దాని కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు. మట్టి యొక్క Ph4.5నుండి 7 మధ్య ఉండాలి, ఎందుకంటే ఇది ఆల్కలీన్ నేలలో పెరగదు.

రైతులు ఇప్పటికి దిగుబడి సామర్ధ్యం తక్కువగా, కర్క్యుమిన్‌ శాతం తక్కువగా ఉన్నటువంటి దీర్ఘకాలిక రకాలనే సాగుచేస్తున్నారు. నూతన రకాలైనటువంటి స్వల్పకాలిక, అధిక దిగుబడి సామర్థ్యంతోపాటు ఎక్కువ ర్క్యుమిన్‌ శాతం కలిగిన మరియు ఆకుమచ్చ తెగులు, తాటాకు మచ్చ తెగుళ్ళను తట్టుకునే రకాలను సాగుచేస్తే తక్కువ కాల పరిమితిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంది. స్వల్పకాలిక రకాలు త్వరగా పంటకాలం పూర్తి చేసుకోవడం వల్ల రెండవ పంటగా ఏదైనా పప్పుజాతి పంటలను వేసుకొని ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందవచ్చు.

విత్తనాల ముందు, భూమిని 3-4 సార్లు దున్నుతారు. వర్షాకాలం ముందు వర్షానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. వర్షాకాలం ముందు వర్షం కురిసిన వెంటనే పొలంలో 1 మీ వెడల్పుతో పడకలు తయారు చేయాలి, 30 సెం.మీ ఎత్తు ఉండాలి మరియు పడకల మధ్య 50 సెం.మీ స్థలం ఇవ్వాలి.

రైతులు సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతున్నారు. బలమైన కొమ్మలే ఏపుగా పెరుగుతాయన్న నమ్మకం, అపోహతో దొడ్డు విత్తనాన్ని, పెద్ద కొమ్మలను అలాగే వేస్తుండడం వల్ల విత్తన మోతాదు ఎక్కువ కావలసివస్తుంది. సాధారణంగా రైతులు క్వింటా విత్తన పసుపును రూ. 3000-3500 పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తుంటారు. దీనివల్ల ఎకరానికి 10 క్వింటాళ్ళ విత్తనానికి రూ. 30,000-35,000 ఖర్చు అవుతుంది.

ఇలా కాకుండా ఒంటి కన్ను ముచ్చె విధానాన్ని అనగా పెద్ద కొమ్మలను కణుపుల వద్ద ముక్కలుగా కోసి ప్రతి ముక్కలో రెండు లేదా మూడు మొగ్గలు ఉండే విధంగా అవలంభిస్తే ఎకరానికి 2-3 క్వింటాళ్ళ విత్తనం సరిపోతుంది. దీని ద్వారా 7-8 క్వింటాళ్ళ విత్తనం ఆదా అవుతుంది. అంటే ఎకరానికి రూ. 21,000-24,000 విత్తనం మీద పెట్టే పెట్టుబడి, ఖర్చును తగ్గించుకోవచ్చు.

విత్తన శుద్ధి :

పసుపులో వచ్చే చీడ, పీడల్లో దుంపపుచ్చు, దుంపకుళ్ళు వంటివి విత్తనం ద్వారా సంక్రమిస్తాయి. కాబట్టి పసుపు విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్నట్లయితే చాలా వరకు వీటి ఉధృతిని తొలిదశలోనే అధికమించవచ్చు. తగ్గించవచ్చు. విత్తనశుద్ధి కొరకు ఒక కడాయిలో లీటరు నీటికి రిడోమిల్‌ ఎం.జ.డ్‌ 2 మి.లీ. + క్లోరోపైరిఫాస్‌ 2 మి.లీ. , ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. చొప్పున ద్రావణాన్ని తయారు చేసుకొని అందులో కత్తిరించిన ఒంటి కన్ను ముచ్చెలను 30-45 నిమిషాలు నానబెట్టి, తరువాత నీడలో ఆరబెట్టాలి. తరువాత ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రనాశినితో దుంపలను శుద్ధి చేసుకుంటే మంచిది. తద్వారా విత్తనం ద్వారా వ్యాప్తి చెందే దుంపపుచ్చు, దుంపకుళ్ళు తెగుళ్ళ ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు.

విత్తన శుద్ధి కొరకు రసాయనాలతో పాటు కూలీలకు ఎకరానికి రూ. 1500-2000 వరకు ఖర్చు అవుతుంది. కాని విత్తన శుద్ధి చేసుకోకపోతే దుంపపుచ్చు మరియు దుంపకుళ్ళు ఉధృతి ఎక్కువగా రావడం వల్ల మందులు, రసాయనాల మీద వేలలో ఖర్చు పెట్టవలసి వస్తుంది. దీని ద్వారా రైతుకు పెట్టుబడి పెరగడంతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతుంది. కాబట్టి రైతులు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులను పొందవచ్చు.