Flights To USA : అమెరికాకు విద్యార్థుల క్యూ..విమాన సర్వీసులు రెట్టింపు

ఉన్నత విద్య కోసం పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు.

Flights To USA : అమెరికాకు విద్యార్థుల క్యూ..విమాన సర్వీసులు రెట్టింపు

Air India

Flights To USA ఉన్నత విద్య కోసం పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు. విద్యార్ధుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా..ఆగస్ట్‌ మొదటి వారం నుంచి అమెరికాకి నాన్ స్టాఫ్ ఫ్లైట్ సర్వీసులను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది. కాగా, అనివార్య కారణాల వల్ల ఎయిర్‌ ఇండియా విమాన ప్రయాణాల రీషెడ్యూల్‌పై విద్యార్థుల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో అదనపు విమానాలు నడుపుతామని ఆ సంస్థ తెలిపింది.

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో..మే-4 నుంచి భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో యూఎస్ కి విమాన సర్వీసులను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. ఆంక్షలకు ముందు అమెరికాకు రెండు వైపులా వారానికి సుమారు 40 విమానాలు నడిపినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఆంక్షల వల్ల ఈ సంఖ్య 10లోపుకి పడిపోయిందని తెలిపింది.

అయితే ప్రస్తుతం విద్యార్ధులు పెద్ద సంఖ్యలో అమెరికాకి వెళ్తున్న నేపథ్యంలో టిక్కెట్ల బుకింగ్ బాగా పెరిగిందని… వచ్చే వారం నుంచి అమెరికాకి వారానికి 21 విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. న్యూఢిల్లీ నుంచి న్యూజెర్సీ రాష్ట్రంలోని నివార్క్ నగరానికి ఆగస్టు-6,20,27 తేదీల్లో అదనపు విమానాలు నడపనున్నట్లు శుక్రవారం ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ రూట్లో నడుస్తున్న విమానాల సర్వీసుల ఇవి అదనం అని తెలిపింది.

మరోవైపు, భారత్-అమెరికా మధ్య నాన్ స్టాఫ్ విమానాలను నడుపుతున్న మరో విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్ లైన్స్..ప్రస్తుతానికి ఇండియా ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలను మార్చడం లేదని తెలిపింది.