Tejas Express: ఆలస్యంగా నడిచిన రైలు.. ఐఆర్‌సీటీసీ 4.5 ల‌క్ష‌ల ప‌రిహారం!

ఇండియాలో రైలు ఆలస్యంగా రావడం చాలా సాధారణ విషయమని తెలిసిందే. అయితే.. ఇలా రైలు ఆలస్యమైనా ప్రతిసారి అందులోని ప్రయాణికులకు పరిహారం అందిస్తే..

Tejas Express: ఆలస్యంగా నడిచిన రైలు.. ఐఆర్‌సీటీసీ 4.5 ల‌క్ష‌ల ప‌రిహారం!

Tejas Express

Tejas Express: ఇండియాలో రైలు ఆలస్యంగా రావడం చాలా సాధారణ విషయమని తెలిసిందే. అయితే.. ఇలా రైలు ఆలస్యమైనా ప్రతిసారి అందులోని ప్రయాణికులకు పరిహారం అందిస్తే.. ఇప్పటికే మన ఇండియన్ రైల్వే సంస్థకున్న ఆస్తులు కరిగిపోయి ఇంకా అప్పులపాలైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన దేశంలో రైళ్లు సమయానికి తిరగడం అంటే చాలా అరుదు. అయితే, ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం చాలా రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రైవేట్ రైళ్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ రైళ్లకు ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అందులో ఒకటే ఈ ఆలస్యమైతే పరిహారం చెల్లించే విధానం.

విమానంలాంటి వ‌స‌తుల‌తో ఇండియాలో తొలి ప్రైవేటు రైలు తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ (Tejas Express) 2019 ఆగ‌స్ట్ 4 నుండి మొదలైంది. ఈ రైలు ప్రయాణంలో ఆలస్యమైతే ఐఆర్ సీటీసీ ప్రయాణికులు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. గంట ఆల‌స్య‌మైతే రూ.100, 2 గంట‌లు, అంత‌కంటే ఎక్కువైతే రూ.250 ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా,శ‌ని, ఆదివారాల్లో మూడు ట్రిప్పులు క‌లిపి ఈ రైలు రెండున్న‌ర గంట‌లు ఆల‌స్య‌మైంది. శ‌నివారం భారీ వ‌ర్షాల కార‌ణంగా ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో సిగ్న‌ల్ ఫెయిల‌వ‌డంతో ఈ తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా తిరగగా.. ఆదివారం ల‌క్నో నుంచి ఢిల్లీ వెళ్లేసమయంలో గంట ఆల‌స్యంగా న‌డిచింది.

దీంతో రెండున్న‌ర గంట‌లు ఆల‌స్యమైనందుకు అందులోని మొత్తం 2035 మంది ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సీటీసీ రూ.4.5 లక్ష‌ల ప‌రిహారం చెల్లించ‌నుంది. శ‌నివారం రైలులోని 1574 మంది ప్ర‌యాణికుల‌కు రూ.250 చొప్పున రూ.3.93 ల‌క్ష‌లు, ఆదివారం 561 మంది ప్ర‌యాణికులు ఒక్కొక్క‌రికి రూ.150 చొప్పున ఐఆర్‌సీటీసీ చెల్లిస్తుంది. ఈ రైలు సర్వీస్ ప్రారంభమైన రెండేళ్ల నుండి ఇప్పటి వరకు కేవలం ఐదుసార్లు మాత్రమే ఆలస్యంగా నడవగా.. ఇంత భారీ మొత్తంలో పరిహారం చెల్లించడం మాత్రం ఇదే. ఈ రైలు దాదాపుగా 99.9 శాతం టైంకి తిరుగుతుండగా ఏ మాత్రం ఆలస్యమైనా పరిహారం చెల్లించాల్సిందే.