Bandi Sanjay Arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Bandi Sanjay Arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

Bandi Sanjay Arrest

Updated On : January 2, 2022 / 11:18 PM IST

Bandi Sanjay Arrest : కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి తరలించారు. తన కార్యాలయానికి తాళాలు వేసుకుని బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. పోలీసులు గ్యాస్ కట్టర్ సాయంతో తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి సంజయ్ ను అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీక్షకు అనుమతులు లేవని, దీక్ష ప్రయత్నాన్ని విరమించాలని ఉదయం నుంచి విజ్ఞప్తి చేశామని సీపీ సత్యనారాయణ చెప్పారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే బండి సంజయ్ ని అరెస్ట్ చేశామని వివరించారు. పోలీసుల విధులను బీజేపీ నేతలు అడ్డుకున్నారని సీపీ అన్నారు.

Covid Restrictions : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు బంద్

పోలీసుల తీరుపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తన దీక్షను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. కరోనా నిబంధనల పేరుతో దీక్షను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ జన జాగరణ దీక్ష తలపెట్టారు. రేపు ఉదయం 5 గంటల వరకూ నిద్రపోకుండా జాగరణ దీక్ష చేస్తానన్నారు. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జన జాగరణ దీక్షకు అనుమతులు లేవని పోలీసులు తేల్చి చెప్పారు.

పోలీసుల తీరుని బండి సంజయ్ తప్పుపట్టారు. నల్గొండలో సీఎం కేసీఆర్‌ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదన్నారు.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

సంజయ్ జాగరణ దీక్షతో కరీంనగర్‌లో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.