Bandi Sanjay Bail : బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు

Bandi Sanjay Bail : 8గంటల ఉత్కంఠకు తెరపడింది. బండి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

Bandi Sanjay Bail : బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు

Bandi Sanjay Bail

Bandi Sanjay Bail : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు భారీ ఊరట లభించింది. న్యాయమూర్తి బండి సంజయ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.20వేల పూచికత్తుతో బండి సంజయ్ కు బెయిల్ ఇచ్చారు. 8 గంటలకు ఉత్కంఠకు తెరదించుతూ బండి సంజయ్ కు బెయిల్ ఇచ్చారు న్యాయమూర్తి.

బెయిల్ పై నిర్ణయాన్ని మేజిస్ట్రేట్ మూడుసార్లు వాయిదా వేశారు. చివరికి ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనిత రాపోలు.. బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేశారు. ఎస్ఎస్ సీ క్వశ్చన్ పేపర్ల లీక్ వ్యవహారంలో సూత్రధారిగా బండి సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్నారు. బెయిల్ మంజూరు కావడంతో బండి సంజయ్ రేపు(ఏప్రిల్ 7) ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, బండి సంజయ్ కు బెయిల్ మంజూరు కావడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : 10th Paper Leak case : కేసీఆర్ మెడలు వంచే టైమ్ దగ్గరపడింది .. కుట్రలో భాగంగానే నాపై పేపర్ లీక్ కేసు – బండి సంజయ్

కుట్ర కోణంతో బండి సంజయ్ ని ఈ కేసులో ఇరికించారని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే విచారణ కీలక దశలో ఉన్నందున ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని పీపీ కోరారు. బండి సంజయ్ ఫోన్ మిస్ అయ్యిందని, అందులో విలువైన డేటా ఉందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్ ని కస్టడీకి ఇస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరికి బండి సంజయ్ కి బెయిల్ ఇచ్చారు.

టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీక్ వెనుక బీజేపీ, బండి సంజయ్ కుట్ర ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు. బండి సంజయ్ తన స్వార్ధ రాజకీయాల కోసం, అడ్డదారిలో అధికారం పొందేందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దారుణం అన్నారు. దీని వెనుక బండి సంజయ్ ఉన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ను ఏ-1గా చేర్చారు పోలీసులు.

Also Read..Peddi Sudarshan Reddy: సెల్ ఫోన్ ఇవ్వమంటే బండి సంజయ్‌కు ఎందుకు భయం?

బండికి బెయిల్, కిషన్ రెడ్డి హర్షం:
బండి సంజయ్ కు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అక్రమంగా బనాయించిన కేసు విచారణలో సహకరిస్తామన్నారు. మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు కిషన్ రెడ్డి. అక్రమ కేసులతో గొంతునొక్కాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ అరాచకాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.