తెలంగాణ కేబినెట్..మద్యం సేల్స్ పై సస్పెన్స్  : గోదాంలో 4 రోజులకు సరిపడా స్టాక్

  • Published By: madhu ,Published On : May 5, 2020 / 12:17 PM IST
తెలంగాణ కేబినెట్..మద్యం సేల్స్ పై సస్పెన్స్  : గోదాంలో 4 రోజులకు సరిపడా స్టాక్

తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020, మే 05వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో కేబినెట్ భేటీ జరుగుతోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం లాక్ డౌన్ సడలింపుల విషయంపై చర్చిస్తున్నారు. లాక్ డౌన్ కొనసాగించాలనే దానిపై మొగ్గు చూపుతున్నారని తెలుస్తొంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

ప్రధానంగా లిక్కర్ కు అనుమతినిస్తారా ? లేదా ? అనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సేల్స్ ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో లిక్కర్ కు అనుమతినిచ్చి..భారీగా (75 శాతం) రేట్లు పెంచింది. ఈ క్రమంలో ఎలా ముందుకు వెళుదామనే దానిపై చర్చ జరుగుతోంది. లిక్కర్ షాపుల్లో ఉన్న గోదాంలో స్టాక్ లెక్క తీయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. 

రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టాక్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. మద్యం దుకాణాలు బంద్ ఉన్న నాడు ఎంత స్టాక్ ఉంది ? ప్రస్తుతం ఎంత స్టాక్ ఉందనే దానిపై లెక్క తీస్తున్నారు.  కొన్ని దుకాణాల్లో తేడాలు వస్తున్నాయని తెలుస్తోంది. 

లిక్కర్ గోదాంలో ఉన్న స్టాక్ నాలుగు రోజుల వరకు సరిపోతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల వరకు లిక్కర్ సేల్స్ కు అనుమతినివ్వాలా ? అనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలా ? వద్దా ? అనే దానిపై చర్చిస్తున్నారని సమాచారం. 

గ్రీన్, ఆరెంజ్ జోన్ల వరకు మద్యం విక్రయాలకు అనుమతినిస్తే..రెడ్ జోన్లలో ఉన్న వారు ఆ ప్రాంతాలకు వెళుతారని, దీంతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నారు. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొద్దని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. మరి వైన్స్ షాప్స్ ఓపెన్ చేస్తారా ? లేదా ? తెలియాలంటే కొద్దిగా వెయిట్ చేయాల్సిందే.