Telangana Government : 15 కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టులకు తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ‌లో కేసీఆర్ ప్రభుత్వం జ‌ల‌య‌జ్ఙాన్ని కొనసాగిస్తోంది. బీడు భూముల‌ను త‌డ‌ప‌డమే ల‌క్ష్యంగా....కేసీఆర్ స‌ర్కార్ ప్రాజెక్టుల బాట ప‌ట్టింది.

Telangana Government : 15 కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టులకు తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Telangana

Telangana Government : ఏపీ, తెలంగాణల మ‌ధ్య కృష్ణా నీళ్లపై క‌య్యం ఒక‌వైపు.. జ‌ల‌జ‌గ‌డంపై తేల్చకుండా కేంద్రం నాన్చుడు ధోర‌ణి మరోవైపు.. అయినా తెలంగాణ స‌ర్కార్ ఏమాత్రం త‌న దూకుడు త‌గ్గించ‌డం లేదు. మొద‌లు పెట్టిన ప్రాజెక్టుల్లో వేగం పెంచుతూనే.. డ‌జ‌న్‌కు పైగా కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుడుతూ.. తెలంగాణ‌లో జ‌ల‌య‌జ్ఞాన్ని పూర్తి చేసేందుకు గులాబి స‌ర్కార్ ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకెళుతోంది.

తెలంగాణ‌లో కేసీఆర్ ప్రభుత్వం జ‌ల‌య‌జ్ఙాన్ని కొనసాగిస్తోంది. బీడు భూముల‌ను త‌డ‌ప‌డమే ల‌క్ష్యంగా….కేసీఆర్ స‌ర్కార్ ప్రాజెక్టుల బాట ప‌ట్టింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా గోదావ‌రిపై కాళేశ్వరం ఎత్తిపోత‌ల ప్రాజెక్టును.. అది కూడా రికార్డు స‌మ‌యంలో పూర్తి చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఎక‌రాకు సాగు నీరు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు వెళుతుంది.

తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజు నుంచే సాగునీరు కోసం ప్రాజెక్టుల‌ నిర్మాణంపై ఫోకస్‌ పెట్టారు. ద‌క్షిణ తెలంగాణలోని పాల‌మూరు, రంగారెడ్డి, న‌ల్లగొండ, ఖ‌మ్మం జిల్లాల‌కు సాగు నీరు అందించేందుకు కృష్ణా న‌దిపై పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప‌నుల‌ను కొనసాగిస్తోంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. దీనికి కౌంట‌ర్‌గా ఏపీ సంగ‌మేశ్వర వ‌ద్ద రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టింది. అంతేకాదు పోతిరెడ్డి పాడు కాల్వ విస్తర‌ణ‌కు పూనుకుంది.

ఏపీ స‌ర్కార్ చేప‌ట్టిన సీమ ఎత్తిపోత‌ల అక్రమ ప్రాజెక్టని వాదిస్తున్న తెలంగాణ స‌ర్కార్… దీన్ని అడ్డుకునేందుకు లీగ‌ల్ ఫైట్ కొన‌సాగిస్తోంది. ఎన్జీటీని ఆశ్రయించ‌డంతోపాటు.. సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు రెడీ అవుతుంది. ఇదే అంశంపై ఏపీ ఏక‌ప‌క్ష వైఖ‌రీని కేంద్రం ముందు పెట్టిన స‌ర్కార్ .. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ట్రైబ్యూన‌ల్ ఏర్పాటు చేయాల్సిందే అని కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. అయితే ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం త‌ప్పుప‌డుతోంది.

ఇటు జ‌గ‌న్ స‌ర్కార్ స్పీడ్…. అటు కేంద్రం నాన్చుడు ధోరణితో ఇబ్బందిపెడుతున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. త‌న‌దైన దూకుడుతో ముందుకు వెళుతుంది. ప్రాజెక్టుల ప‌నుల్లో వేగం పెంచింది. పాల‌మూరు రంగారెడ్డి ప‌నుల‌ను యుద్ద ప్రాతిపాదికగా పూర్తి చేసేందుకు న‌డుం బింగించింది. అంతేకాదు.. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులైన SLBC, బీమా టూ (2), కోయిల్ సాగ‌ర్, క‌ల్వకుర్తి రెండో ద‌శల‌ను సాధ్యమైనంత త్వర‌గా పూర్తి చేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

ఇలా ఒక‌వైపు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు ప‌నుల్లో వేగం పెంచుతూనే.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాదు ఇప్పుడు ఏకంగా మ‌రో 15 ఎత్తిపోత‌ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు సీఎం కేసీఆర్. నెల్లిక‌ల్లు ఎత్తిపోత‌ల కింద 24 వేల 886 ఎక‌రాల‌కు, ముక్యాల ఎత్తిపోత‌ల ద్వారా 53వేల ఎక‌రాల‌ు, బోత‌ల‌పాలెం ఎత్తిపోత‌ల‌తో 8వేల 610 ఎక‌రాలు, జాన్ ప‌హ‌డ్ ఎత్తిపోత‌లతో 5 వేల 650 ఎక‌రాలతో పాటు SLBC ట‌న్నెల్ వ‌ర్క్‌ను పూర్తి చేయాల‌ని తెలంగాణ‌ సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

మొత్తానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్రం త‌న కంట్రోల్‌లో పెట్టుకోవాల‌ని చూస్తున్నా.. త‌న‌దైన దూకుడుతో ప్రాజెక్టుల పూర్తి కోసం ముందుకు వెళుతున్నారు కేసీఆర్.. మ‌రి ఇప్పటికే కేఆర్ఎంబీకి గెజిట్‌తో ప‌వ‌ర్స్ ఇచ్చిన కేంద్రం.. తెలంగాణ స్పీడ్‌ను అడ్డుకుంటుందో లేదో చూడాలి.