Telecom Sector : టెలికాం రంగంలో భారీ సంస్కరణలు..వంద శాతం ఎఫ్ డీఐలకు కేంద్రం అనుమతి

టెలికాం రంగంలో ఎఫ్‌డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది.

Telecom Sector : టెలికాం రంగంలో భారీ సంస్కరణలు..వంద శాతం ఎఫ్ డీఐలకు కేంద్రం అనుమతి

Fdi

central government allow FDI : కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగంలో భారీ సంస్కరణలు తీసుకురానుంది. టెలికాం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా ఏజీఆర్‌ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం (సెప్టెంబర్15, 2021) జరిగిన కేబినెట్‌ సమావేశంలో టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

అనంతరం టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌)కు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమన్నారు. అందుకే ఏజీఆర్‌ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు చెప్పారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్‌ నుంచి మినహాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

Stock Market : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

అదేవిధంగా ఏజీఆర్‌ బకాయిల కింద టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తాలపై మారటోరియం విధిస్తున్నట్లు వివరించారు. ఈ రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలు అనుమతించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో కొన్ని కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలని టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయలు ఒక్కసారి చెల్లించడం భారంతో కూడుకుందంటూ ఆయా కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏజీఆర్‌ బకాయిలను 10ఏళ్లలో చెల్లించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఎక్కువగా బకాయి పడిన వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికే రూ.7,854 కోట్లు చెల్లించింది. మరో రూ.50వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.

ఈ క్రమంలో అప్పుల్లో కూరుకుపోయిన తమ కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని వొడాఫోన్‌ ఐడియా పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు టెలికాం రంగానికి అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు రాణించాయి.