YS.Sharmila: షర్మిల పాదయాత్రలో కీలక ఘట్టం.. 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న ‘ప్రజా ప్రస్థానం’

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల తెలంగాణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతున్నారు. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుంది. షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇదే మైలురాయిగా నిలుస్తుంది.

YS.Sharmila: షర్మిల పాదయాత్రలో కీలక ఘట్టం.. 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న ‘ప్రజా ప్రస్థానం’

YS.Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నవంబర్ 4, శుక్రవారం నాటికి ఆమె పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. దీంతో తెలంగాణలో ఈ ఘనత సాధించిన మహిళా నేతగా షర్మిల అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం 2021, జూలై 8న షర్మిల ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)’ పేరుతో తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించారు. అనంతరం.. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాల‌న తీసుకురావటమే ల‌క్ష్యంగా ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

CM KCR: హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్నే కూలుస్తారా.. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్
తండ్రి అడుగుజాడల్లో
గత సంవత్సరం అక్టోబర్ 20న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను ప్రారంభించారు. ఇక్కడినుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించేందుకు ఒక కారణం ఉంది. గతంలో షర్మిల తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఆయన 2003 ఏప్రిల్‌లో చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంభించారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే సెంటిమెంట్‌గా భావించి తన తండ్రిలాగే చేవెళ్ల నుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర మొదలుపెట్టారు. తండ్రిలాగే ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకం అవుతూ యాత్ర కొనసాగిస్తున్నారు.

CM KCR: బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్
విశేష ఆదరణ
షర్మిల చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ యాత్రకు తెలంగాణలో విశేష ఆదరణ లభిస్తోంది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో షర్మిల మమేకం అవుతున్నారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు. అనేక చోట్ల సభలు నిర్వహిస్తున్నారు. ‘మాట-ముచ్చట’ కార్యక్రమం ద్వారా పలు చోట్ల ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గురువారం, నవంబర్ 3 నాటికి షర్మిల పాదయాత్ర 198వ రోజుకు చేరింది. తెలంగాణలోని అనేక జిల్లాల మీదుగా షర్మిల యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. గతంలో పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట నేషనల్ హైవే దగ్గర వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షర్మిల తల్లి విజయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జోరు వానలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు
వివాదాలు
షర్మిల పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా అనేక అంశాల్లో చర్చనీయాంశమైంది. అధికార టీఆర్ఎస్‌ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలపై ఆమె చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై చేసిన ఆరోపణలు రాజకీయంగా వేడి పుట్టించాయి. దీంతో ఆయా మంత్రులు, ఇతర నేతలు కూడా షర్మిలపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అటు టీఆర్ఎస్ నేతలు, ఇటు షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పలు విమర్శలు ఎదురవుతున్నా వెనుకడుగు వేయకుండా షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

Elon Musk: ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రద్దు చేస్తూ నిర్ణయం
పాలేరు నుంచి పోటీ?
రాజకీయంగా పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో ప్రకటించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ జనరల్ స్థానం. అలాగే ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో వైఎస్సార్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందువల్ల ఆమె పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు.