CJI : పోలీస్‌ స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన..ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

పోలీస్‌ స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

CJI : పోలీస్‌ స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన..ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

Cji

CJI పోలీస్‌ స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కస్టడీ పేరుతో చిత్రహింసలు, దౌర్జన్యాలు నాగరిక సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రధాన సమస్యలని సీజేఐ తెలిపారు. రాజ్యాంగబద్ధమైన సంరక్షణ ఉన్నప్పటికీ కస్టోడియల్ హింస తీవ్రం కావడం సరికాదన్నారు. పోలీస్‌స్టేష‌న్‌ల‌లో న్యాయపరమైన ప్రతినిధిత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమ‌ని సీజేఐ అభిప్రాయ‌ప‌డ్డారు. పోలీసులు సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఆదివారం..జాతీయ న్యాయసేవల అథారిటీ రూపొందించిన మొబైల్ యాప్‌ ని సీజేఐ ఆవిష్కరించారు. అదేవిధంగా విజన్ స్టేట్‌మెంట్‌ను కూడా విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న, త‌దిత‌ర అంశాల‌పై సీజేఐ మాట్లాడారు. పోలీసుల అధికార దుర్వినియోగం సహా.. ప్రముఖ వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఇటీవల నివేదికలు వచ్చాయని, ఇది దురదృష్టకరమని రమణ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసు అధికారులు సున్నితంగా వ్యవహరించేలా చూడాలని న్యాయసేవాధికార సంస్థ(నల్సా)కి సూచించారు. మేమున్నామనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగించినప్పుడే న్యాయవ్యవస్థ పౌరుల విశ్వాసాన్ని పొందుతుందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

అదేవిధంగా,తమకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయనే విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్వీ రమణ తెలిపారు. ఉచితంగా న్యాయసేవలను పొందడం అనేది ప్ర‌జ‌ల‌కు రాజ్యంగం కల్పించిన హక్కు అని తెలిపారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. ఈ దిశగా ప్రతి పోలీస్‌స్టేష‌న్‌, జైలు ద‌గ్గ‌ర హోర్డింగులను నెలకొల్పాలన్నారు. ఇందుకోసం జాతీయ న్యాయసేవ అథారిటీ దేశవ్యాప్తంగా ఓ ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ఎన్వీ రమణ కోరారు. ‘యాక్సెస్ టు జస్టిస్’ ప్రాజెక్ట్‌ను అంతులేని మిషన్​గా సీజేఐ అభివర్ణించారు.

ఏడాదిన్నర కాలంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా జాతీయ న్యాయసేవల‌ అథారిటీ తన సేవ‌ల‌ను కొనసాగిస్తుండ‌టం హర్షణీయమని మెచ్చుకున్నారు. గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు సైతం తమ ఉచిత న్యాయసేవలను తీసుకెళ్లేలా చర్యలను చేపట్టాలని సూచించారు. పేదలకు న్యాయం దూరం కాకూడదని జాతిపిత మహాత్మాగాంధీ కోరుకునే వారని సీజేఐ గుర్తుచేశారు.

మరోవైపు, పేదలకు న్యాయసేవలను ఉచితంగా అందజేయడంపై న్యాయవాదులు తమ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉందని ఎన్వీ రమణ సూచించారు. ప్రత్యేకించి సీనియర్ అడ్వకేట్లు తమ రోజువారీ కార్యక్రమాల్లో కొంత సమయాన్ని ఉచిత న్యాయసేవల కోసం కేటాయించాలన్నారు. ఉచిత న్యాయసేవలపై ప్రజల్లో అవగాహనను కల్పించే విషయంలో మీడియా తన వంతు సహకారాన్ని అందజేయాలని ఎన్వీ రమణ అన్నారు.