No Confidence Motion: అవిశ్వాస తీర్మానం చరిత్ర తెలుసా? ఇంతకీ ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని విఫలమయ్యాయి?

గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్‭పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయింది

No Confidence Motion: అవిశ్వాస తీర్మానం చరిత్ర తెలుసా? ఇంతకీ ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని విఫలమయ్యాయి?

India Politics: నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం మోదీ ప్రభుత్వానికి ఇది రెండవసారి. 2019లో మొదటిసారి నరేంద్రమోదీ తొలిసారి అవిశ్వాస తీర్మాన పరీక్షను ఎదుర్కొంది. కాగా, తాజాగా పెట్టిన తీర్మానం రెండవది. ప్రస్తుత బలాబలాలు చూస్తుంటే విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయేలానే ఉంది. వాస్తవానికి ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. అయితే వారి రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ప్రస్తుత తీర్మానాన్ని పార్లమెంటు ముందు ఉంచారు.

No Confidence Motion: 2023లో తన మీద అవిశ్వాస తీర్మానం పెడతారని 2019లోనే చెప్పిన ప్రధాని మోదీ

ఇలాంటి సందర్భాలు భారత పార్లమెంటు చరిత్రలో 28 సార్లు (ప్రస్తుతం కలుపుకుని) వచ్చాయి. అయితే చాలా సందర్భాల్లో ఇవి వీగిపోయాయి. మూడు సందర్భాల్లో మాత్రం సఫలమయ్యాయి. గడిచిన 25 ఏళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానాల చరిత్ర ఓసారి తెలుసుకుందాం. మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని దేశ మొదటి ప్రధానమంత్రి జవహార్‭లాల్ నెహ్రూ ఎదుర్కొన్నారు. 1963 ఆగస్టులో ఆచార్య కృపాలని నెహ్రూ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే అదే సమయంలో ఇండో-చైనా యుద్ధం రావడంతో అది పక్కకు వెళ్లింది. ఇక అతి ఎక్కువసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నది ఇందిరా గాంధీ. ఆమె ప్రభుత్వం మీద 15 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ఒక్కసారంటే ఒక్కసారి కూడా విజయవంతం కాలేదు.

NDA vs INDIA: కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆమోదం తెలిపిన లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా

ఇక లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు ప్రభుత్వాలు మూడేసి సార్లు అవిశ్వాస తీర్మానం పరీక్షను ఎదుర్కొన్నాయి. మొరార్జీ దేశాయ్ రెండుసార్లు ఎదుర్కొన్నారు. ప్రస్తుత నరేంద్రమోదీ ప్రభుత్వం తాజా అవిశ్వాస తీర్మానంతో రెండుసార్లు ఎదుర్కొంది. నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‭పేయి, వీపీ సింగ్, దేవె గౌడ ఒక్కోసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. అయితే అటల్ బిహారీ వాజ్‭పేయి, వీపీ సింగ్, దేవె గౌడ ఈ విశ్వాస పరీక్షలో తమ బలాన్ని నిరూపించలేక రాజీనామా చేశారు.

వీపీ సింగ్ (1990)
జనతాదళ్ నేత వీపీ సింగ్ 1989 నుంచి 1990 మధ్య నేషనల్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచేందుకు బీజేపీ సహా లెఫ్టు పార్టీల మద్దతుతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. కేవలం 11 నెలలు మాత్రమే ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. అయితే రామమందిరం, మండల్ కమిషన్ అంశాల కారణంగా బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో 1990 నవంబర్ 10న వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. ఆయన ప్రభుత్వం నిలబడానికి 261 ఓట్లు కావాలి. కానీ ఆయనకు మద్దతుగా కేవలం 142 ఓట్లు మాత్రమే వచ్చాయి. వ్యతిరేకంగా 346 ఓట్లు వచ్చాయి.

దేవె గౌడ (1997)
దేశ 11వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనతాదళ్ నేత హెచ్‭డీ దేవెగౌడ కేవలం 10 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. 1996 ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. 1996 జూన్ 1న దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో యూనైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 10 నెలల తర్వాత కాంగ్రెస్ చీఫ్ సీతారం కేసరి తన మద్దతు ఉప సంహరించుకోవడంతో 1997 ఏప్రిల్ 11న దేవెగౌడ ప్రభుత్వం కూలిపోయింది. దేవెగౌడకు మద్దతుగా కేవలం 158 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అటల్ బిహారీ వాజ్‭పేయి (1999)
గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్‭పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయింది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్‭పేయి తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అంతే కాకుండా.. కేవలం 16 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది కూడా. 1996 మే 16న ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్‭పేయి ప్రమాణ స్వీకారం చేశారు. అదే 1999 జూన్ 1న రాజీనామా చేశారు. వాజ్‭పేయికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 ఓట్లు వచ్చాయి.

No Confidence Motion: ఓడిపోతామని తెలిసీ కూడా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఇండియా ప్లాన్ ఏంటంటే?

ఇక తాజా విషయానికి వస్తే.. నరేంద్రమోదీ ప్రభుత్వం మీద రెండవసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది విపక్ష కాంగ్రెస్ పార్టీ. 2019లో కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు రాగా వ్యతిరేకంగా కేవలం 126 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో విపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయింది. ఇక తాజాగా పెట్టిన తీర్మానం పరిస్థితి కూడా దాదాపుగా అలాగే కనిపిస్తోంది. తాజా తీర్మానానికి స్పీకర్ ఇంకా తేదీ నిర్ణయించలేదు.