Vinod Kumar: హైదరాబాద్ పర్యటనలో మోదీ అలా అనడం తప్పు: వినోద్ కుమార్

తెలంగాణ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలను వినోద్ కుమార్ తిప్పికొట్టారు. కేంద్ర ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని అనడం ఏంటని నిలదీశారు.

Vinod Kumar: హైదరాబాద్ పర్యటనలో మోదీ అలా అనడం తప్పు: వినోద్ కుమార్

Vinod Kumar

Updated On : April 8, 2023 / 4:03 PM IST

Vinod Kumar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని మోదీ అన్నారని అలా అనడం తప్పని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంలో తమతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు ఏమీ జరపలేదన్నారు.

తాము ఏమడిగినా కేంద్ర సర్కారు స్పందించలేదని వినోద్ కుమార్ చెప్పారు. రైల్వే ప్రాజెక్టు భూసేకరణ కూడా తామే భరిస్తున్నామని తెలిపారు. కనీసం కొత్త రైల్వే లైన్ ఇచ్చారా? అని అడిగారు. జాతీయ రహదారులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిస్సహాయత వ్యక్తం చేశారని చెప్పారు. ఏ ప్రాజెక్టుకైనా సంపూర్ణ నిధులు ఇచ్చారా? అని నిలదీశారు.

జాతీయ రహదారులపై మోదీ క్రెడిట్ తీసుకునే అవసరం లేదని వినోద్ కుమార్ అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ రహదారులు వచ్చాయని చెప్పారు. ఎయిమ్స్ తెలంగాణ నిధులతో నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన ఉందంటూ విమర్శలు చేస్తున్నారని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉద్యమం నుంచి వచ్చారని చెప్పారు.

అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఫడ్నవీస్, అనురాగ్ ఠాగూర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సింధియా ఎవరని, బీజేపీలో కుటుంబ పాలన లేదా? అని అన్నారు. అటువంటి వారు కుటుంబ పాలన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు. బీజేపీలో రెండు గ్రూపులున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సుష్మాస్వరాజ్ మద్దతు తెలిపారని, అనంతరం బీజేపీ నేతలు కొందరు రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ తల్లి, బిడ్డలను వేరు చేశారన్నారని తెలిపారు.

అత్యంత అవినీతి రాష్ట్రాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవా? అని అన్నారు. తెలంగాణ అవినీతి రాష్ట్రం అంటూ విమర్శలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఏయే ప్రభుత్వాలు ఉన్నాయని నిలదీశారు. అక్కడ పర్సెంటేజ్ లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణకు మోదీ కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించామని, కొత్తగా ఏమీ ప్రకటన చేయలేదని విమర్శించారు.

Telangana : తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే కేంద్రం అవార్డులు ఎందుకిస్తుంది? అధికారిక కార్యక్రమంలో రాజకీయాలేంటి? : మంత్రి తలసాని