UP Election : యోగి మఠానికి,మోదీ పర్వతాల్లోకి..పోలీసులకు ఓవైసీ హెచ్చరికపై దుమారం

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార ర్యాలీలను నిర్వహిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

UP Election : యోగి మఠానికి,మోదీ పర్వతాల్లోకి..పోలీసులకు ఓవైసీ హెచ్చరికపై దుమారం

Owaisi

UP Election : వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార ర్యాలీలను నిర్వహిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు కూడా పేల్చుకుంటున్నారు. బీజేపీ-ఎస్పీ పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తూ అప్పుడే ఎన్నికల ఫీవర్ తీసుకొచ్చాయి.

ఇక,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా యూపీలో గట్టి పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 100 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రచార ర్యాలీల్లో ఎంఐఎం నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీనే స్వయంగా ఓ ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ఆదిత్యనాథ్,ప్రధాని మోదీని విమర్శిస్తూ యూపీ పోలీసులను బహిరంగంగా హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యూపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఇటీవల నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో ఓవైసీ పోలీసులనుద్దేశించి మాట్లాడుతూ..”నేను పోలీస్ ఆఫీసర్లకు ఓ విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. మోదీ,యోగి ఎల్లకాలం ఇక్కడే ఉండరనే నిజాన్ని యూపీ పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరముంది. మా ముస్లింలు ఖచ్చితంగా ఒత్తిడికి గురిచేయబడ్డారు. మీ వేధింపులు మేము మర్చిపోం అని గుర్తుంచుకోండి. మీ వేధింపులు మేము గుర్తుపెట్టుకుంటాం. అల్లా తన శక్తితో మిమ్మల్ని అంతం చేస్తాడు. పరిస్థితులు మారతాయి,అప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకొస్తారు? యోగి తిరిగి తన మఠానికి వెళ్లిపోతాడు,యోదీ పర్వతాల్లోకి వెళ్లిపోతాడు. అప్పుడు మిమ్మల్ని కాపాడేదెవరు”అంటూ పోలీసులను హెచ్చరించారు ఓవైసీ. ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేశంలో వేధింపులకు పాల్పడేందుకు ఔరంగజేబు,బాబర్ లాంటి వాళ్లు ఎప్పుడొచ్చినా..మహారానా ప్రతాప్,శివాజీ,యోగి,యోగి లాంటి వాళ్లు పుట్టుకొస్తారని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర ఓ ట్వీట్ లో తెలిపారు. యూపీ పోలీసులపై,యోగి,మోదీలపై ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా. ఓ ఎంపీ అయి ఉండి ఓవైసీ రాజ్యంగవిరుద్ధమైన వ్యాఖ్యలు చేశారన్నారు. తక్షణమే ఎన్నికల కమిషన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలని భాటియా డిమాండ్ చేశారు.

అయితే బీజేపీ విమర్శల నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓవైసీ వరుస ట్వీట్ లు చేశారు. తన 45 నిమిషాల ప్రసంగంలోని ఒక నిమిషం నిడివిగల వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఓవైసీ తెలిపారు. హరిద్వార్ లో మూడు రోజుల”ధర్మ సంసద్”సందర్భంగా మైనార్టీ కమ్యూనిటీలకు వ్యతిరేకంగా మతపరమైన,రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని,హరిద్వారా మీటింగ్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే తన వీడియోని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాని ఓవైసీ అన్నారు. తాను ఎలాంటి హింసను ప్రోత్సహించలేదని,ఎవరికీ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని,తాను కేవలం పోలీసుల వేధింపుల గురించే మాట్లాడానని ఓవైసీ తెలిపారు. తన ఫుల్ స్పీచ్ వీడియోను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు ఓవైసీ.

ALSO READ Vaccination In Delhi : ఢిల్లీలో 100శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి