Heart Attack : అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుందంటే?..

వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో బరువుగా, అసౌకర్యంగా, మంటగా అనిపించినా, కళ్లు తిరుగుతున్నా, గుండె దడ పెరిగినా ఆలోచించాల్సిందే...వ్యాయామాలు చేయటం నిలిపివేసి కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి.

Heart Attack : అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుందంటే?..

Heart

Heart Attack : జీవనశైలిలో మార్పులు, వత్తిడిలు, బిజీ లైఫ్ ఇలాంటి వాటితో గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే గుండెపోటుకు ఇవి కొన్ని కారణాలు కావచ్చు. అయితే ఇతరత్ర కారణాలు కూడా అకస్మాత్తుగా గుండెపోటు రావటానికి దారితీసేందుకు కారణమవుతాయి. రక్తనాళాల్లో 60 లేదా 70 శాతం పూడికలు ఉన్నవాళ్లలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. అంతకంటే తక్కువగా ఇరవై, ముప్పై శాతం మేరకు పూడిక ఉన్నా రక్తసరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. దాంతో లక్షణాలు కూడా కనిపించవు. అయితే కొంతమందిలో, మరీ ముఖ్యంగా గుండెపోటు కుటుంబ చరిత్ర కలిగి ఉన్నవాళ్లలో.. కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లోని లోపలి పొర ఎండోథీలియం దెబ్బతిని, పూడిక మీద రక్తం గడ్డకట్టి, రక్తనాళం హఠాత్తుగా పూర్తిగా మూసుకుపోతుంది. దాంతో క్షణాల వ్యవధిలోనే గుండెవేగం విపరీతంగా పెరిగిపోయి, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా గుండెలోని ఎలక్ర్టికల్‌ యాక్టివిటీ మారిపోయి, గుండె ఒక్కసారిగా నిమిషానికి 400 సార్లు అత్యంత వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. ఆ వేగాన్ని గుండె తట్టుకోలేక, చివరకు ఆగిపోతుంది.

నటుడు పునీత్‌ విషయంలో ఈ తరహా పరిస్ధితే ఎదురై ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. వ్యాయామం చేస్తుండగా జరిగింది కాబట్టి వ్యాయామం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పలేం. గుండెపోటుకు గురైనప్పుడు శరీరంలో ఏర్పడే పరిస్థితి ఇది. ఈ పరిస్థితి ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు. శరీరాన్ని అవసరానికి మించిన ఒత్తిడికి లోను చేయడం సరి కాదు. సామర్థ్యానికి మించిన వ్యాయామాలు చేయకపోవడమే మేలు. గుండెజబ్బు లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండగలిగితే గుండెపోటును నివారించుకోవచ్చు. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు కలిగి ఉన్నవాళ్లు గుండెజబ్బులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో బరువుగా, అసౌకర్యంగా, మంటగా అనిపించినా, కళ్లు తిరుగుతున్నా, గుండె దడ పెరిగినా ఆలోచించాల్సిందే…వ్యాయామాలు చేయటం నిలిపివేసి కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి. అదేసమయంలో వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. ఇటీవలి కాలంలో వ్యాయామశాలలో, క్రీడల సమయంలో, జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం మనం చూస్తున్నాం. యువకులు, మధ్య వయస్కులు ఈ తరహా ప్రమాదం బారిన పడుతున్నారు.

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్‌ రెండూ ఒకటే అని అనుకుంటారు చాలా మంది. అయితే వాస్తవానికి అవి రెండు వేరు వేరని వైద్యులు చెబుతున్నారు. గుండె అకస్మాత్తుగా పని చేయకుండా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారని తెలుపుతున్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తి, అక్కడే కుప్పకూలి స్పృహ తప్పుతాడని పేర్కొంటున్నారు. అదే.. గుండె‌కు అందే రక్త ప్రసరణలో ఆటంకాలు ఎదురైనప్పుడు వచ్చేది హార్ట్ ఎటాక్ అని పేర్కొంటున్నారు. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని అంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తేలికగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.