Unstoppable episode 5 : నెపోటిజం గురించి అల్లు అరవింద్‌ని నిలదీసిన బాలయ్య..
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 5 ప్రోమో వచ్చేసింది. కాగా ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ, నెపోటిజం గురించి మెగాప్రోడ్యుసర్ అల్లు అరవింద్‌ని నిలదీశాడు.

Unstoppable episode 5 : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. నిక్కర్చిగా మాట్లాడే బాలకృష్ణని ఈ షోకి వ్యాఖ్యాతగా పెట్టి.. చంద్రబాబు, మోహన్ బాబు, మహేష్ బాబు వంటి ఎంతోమంది సినీరాజకీయ నాయకుల జీవితాల్లో దాగున్న పలు కీలక విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తుండడంతో, అన్‌స్టాపబుల్ షో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతుంది.
ఇక ఈసారి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ల వంతు వచ్చింది. ఎపిసోడ్ 5లో నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబులతో పాటు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు కొంతసేపు సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని నేడు విడుదల చేశారు షో నిర్వాహుకులు. కాగా ఈ ప్రోమోలో బాలకృష్ణ.. నెపోటిజం గురించి మెగాప్రోడ్యుసర్ అల్లు అరవింద్‌ని నిలదీశాడు.
బాలీవుడ్ పరిశ్రమలో మాదిరి టాలీవుడ్ లోను నెపోటిజం ఉంది అంటూ వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆరోపణలను ఈ ఇద్దరు నిర్మాతలు ఎదురుకుంటూ ఉంటారు. దీంతో బాలకృష్ణ ఈ షోలో నెపోటిజం గురించి ప్రశ్నించగా.. ‘ఈ విషయంపై మాట్లాడినందుకు, నన్ను కచ్చితంగా ట్రోల్ చేస్తారు’ అంటూ వ్యాఖ్యానించాడు అల్లు అరవింద్. అయితే అసలు ఈ నిర్మాత, నెపోటిజం గురించి ఏమి మాట్లాడాడు అనేది మాత్రం చూపించలేదు ప్రోమోలో. అది తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.