Ghantasala: ఘంటసాల కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత

Ghantasala: ఘంటసాల కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత

Ghantasala Son Ratnakumar

Ghantasala: గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుంటున్న రత్నాకర్.. ఇవాళ(10జూన్ 2021) ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా సోకి కోలుకున్న తర్వాత రత్నకుమార్ చనిపోయారు. కొన్ని రోజులుగా డయాలసిస్‌ చేయించుకుంటూ ఉండగా.. హార్ట్ ఎటాక్‌ రావడంతో చనిపోయారు.

ఘంటసాల రత్నకుమార్‌ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. తమిళ స్టార్ హీరోలకు సైతం రత్నకుమార్ తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. కృష్ణా జిల్లా, గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామం ఘంటసాల స్వగ్రామం. ఘంటసాల వెంకటేశ్వరరావు తన మేనకోడలైన సావిత్రిని పెళ్లి చేసుకోగా వారికి ఎనిమిది మంది పిల్లలు. నలుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్దకుమారుడు విజయ కుమార్‌ కాగా, రెండో కుమారుడు రత్నకుమార్‌. వీరితోపాటు రవికుమార్‌, శంకర్‌ అనే మరో ఇద్దరు ఉన్నారు.

రత్నకుమార్‌ ఒకేసారి, ఏకకాలంలో ఎనిమిది గంటలపాటు డబ్బింగ్‌ చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి ఎక్కారు. అమేజింగ్‌ వరల్డ్ రికార్డ్ కూడా కైవసం చేసుకున్నారు. తమిళనాడు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ కూడా సృష్టించారు. మొత్తం 1076 తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, సంస్కృతం సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. పదివేల తెలుగు, తమిళ సీరియల్స్‌కి ఇచ్చారు. 50కిపైగా డక్యూమెంటరీల్లో రత్నకుమార్ వాయిస్ వినిపించింది.