Chiranjeevi Birthday Special : మెగాస్టార్ చిరంజీవి.. కోటికొక్కడు.. అవార్డులు.. రికార్డులు.. సేవా కార్యక్రమాలు..

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు కొన్ని కోట్ల తెలుగు ప్రజలకి ఇష్టం, గర్వం. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మార్చేసి తన 'స్టైల్'లో రికార్డులు కొట్టిన ఏకైక హీరో. కొన్ని దశాబ్దాలు సినీ పరిశ్రమని ఏలిన 'రాజా విక్రమార్క'. కోట్లల్లో పారితోషికం, కోట్ల మంది అభిమానులు, ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో.........

Chiranjeevi Birthday Special : మెగాస్టార్ చిరంజీవి.. కోటికొక్కడు.. అవార్డులు.. రికార్డులు.. సేవా కార్యక్రమాలు..

Megastar Chiranjeevi

Chiranjeevi Birthday Special :   మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు కొన్ని కోట్ల తెలుగు ప్రజలకి ఇష్టం, గర్వం. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మార్చేసి తన ‘స్టైల్’లో రికార్డులు కొట్టిన ఏకైక హీరో. కొన్ని దశాబ్దాలు సినీ పరిశ్రమని ఏలిన ‘రాజా విక్రమార్క’. కోట్లల్లో పారితోషికం, కోట్ల మంది అభిమానులు, ఇండస్ట్రీలో నంబర్ 1 హీరో, ఒక దశాబ్దం పాటు సినిమాలకి దూరం అయినా ఆయన స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేకపోయారు అంటే ఏ రేంజ్ సక్సెస్ సాధించాడో అర్ధమవుతుంది. కానీ ఇవన్నీ సాధించడానికి ఎన్నో సంవత్సరాల కష్టం, ఆ కష్టం తాలుకు కన్నీళ్లు అనుభవించి ‘స్వయంకృషి’తో ఎదిగి ఇప్పుడు ఆ కష్టం తాలూకు ప్రతిఫలం అందుకుంటున్న ‘విజేత’.

ప్రేక్షకుల గుండెల్లో ‘ఖైదీ’గా ఎప్పటికి బందీ అయినా ‘మంచి దొంగ’. ఆయన అభిమానులకు ‘అన్నయ్య’, ఆయన్ని విమర్శించేవాళ్ళకి తన వర్క్ తోనే సమాధానం చెప్పే ‘హిట్లర్’, ఎంతోమందికి రక్తదానం చేసిన ‘ఆపద్భాందవుడు’. మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినా ఆయన గురించి మనం చెప్పాల్సిన పనిలేదు. సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గురించి తెలుసు. కేవలం టాలీవుడ్ లోనే కాక ఇండియాలోనే ఎన్నో రికార్డులు సాధించిన మొట్టమొదటి హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనే ఎంట్రీ ఇచ్చి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి హీరోలకి పోటీనిచ్చి నిలబడ్డ ‘బిగ్ బాస్’.

అప్పటివరకు ఒక మూసధోరణిలో కొట్టుకుపోతున్న తెలుగు పరిశ్రమకి తన తన మాస్ డైలాగ్స్, తన కొత్తరకం బ్రేక్ డ్యాన్స్ లు, ఫైట్ సీన్స్, యువతని ఆకర్షించే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా అన్నిట్లో తనకంటూ ఓ ప్రత్యేకతని సృష్టించుకొని ఓ సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసి అభిమానులని సంపాదించుకున్న ‘మాస్టర్’ ఈ మెగాస్టార్.

ఇక ఆయన అవార్డులు, రికార్డులు, రివార్డులకి లెక్కే లేదు. 7 ఫిలిం ఫేర్ అవార్డులు, లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు, రఘుపతి వెంకయ్య నాయిడు అవార్డు, మూడు నంది అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, సైమా అవార్డులు, ఇవి కాక లోకల్, ఇండియన్ స్టేట్స్ లో ఎన్నో లెక్కపెట్టలేనన్ని అవార్డులు, హానరరీ డాక్టరేట్లు సాధించిన హీరో చిరంజీవి.

ఇండియాలో అమితాబ్ తర్వాత కోటి రూపాయలు తీసుకున్న హీరో, సౌత్ ఇండియాలో మొట్టమొదటి సారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరంజీవి. ఇండియాలో మొదటిసారి 7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో చిరంజీవి.

ఇండియాలో పర్సనల్ గా వెబ్ సైట్ ఉన్న మొట్టమొదటి హీరో మెగాస్టార్.

తెలుగులో మొట్టమొదటి సారి 10 కోట్ల కలెక్షన్స్ తెచ్చిన హీరో చిరంజీవి. ఘరానా మొగుడు సినిమాతో 10 కోట్ల కలెక్షన్స్ సాధించారు టాలీవుడ్ లో.

టాలీవుడ్ లో మొట్టమొదటిసారి 30 కోట్ల కలెక్షన్స్ ఇంద్ర సినిమాతో సాధించారు చిరంజీవి.

ఆస్కార్ అవార్డ్స్ కి గెస్ట్ అఫ్ హానర్ గా ఇన్విటేషన్ అందుకున్న తొలి సౌత్ హీరో చిరంజీవి. 1987లోనే ఆస్కార్ వేడుకలకు చిరంజీవి అతిధిగా వెళ్లారు.

చిరంజీవి కెరీర్ లో డైరెక్ట్ 100 డేస్ ఆడిన సినిమాలు 47. ఇన్ని సినిమాలు 100 డేస్ ఆడిన ఏకైక హీరో టాలీవుడ్ లో చిరంజీవి. ఇక 50 డేస్, 150 డేస్, 175 డేస్ ఆడిన సినిమాలు ఎన్నో.

8 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఉన్న ఏకైక హీరో చిరంజీవి. ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరు కెరీర్ లోనే కాక టాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇలా లెక్కలేనన్ని రికార్డులు మెగాస్టార్ సొంతం. ఇక సినిమాల కోసం ఆయన పడే కష్టం, ఆయన తీసుకునే రిస్కులు అసాధారణం. కేవలం మాస్ హీరోగానే కాక స్వయంకృషి, ఆపద్భాందవుడు లాంటి క్లాస్ సినిమాలు, శ్రీ మంజునాథ లాంటి డివోషనల్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులని మెప్పించారు.

సినిమాల ద్వారా తనకి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన అభిమానుల కోసం ఏదైనా చేయాలని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని మొదలు పెట్టి అనేక సేవా కార్యక్రమాలని చేపట్టారు. రక్తదానం, ఐ బ్యాంక్, కష్టాల్లో ఉన్న అభిమానులకు స్వయంగా సాయం, మెడికల్ క్యాంపులు, కష్ట సమయాల్లో ప్రభుత్వాలకి ఆర్ధిక సహాయం, ఇటీవల కరోనా టైంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకుల సరఫరా, ఆక్సిజన్ బ్యాంక్, ఇవన్నీ కాక ఇప్పుడు సినీ కార్మికుల కోసం హాస్పిటల్ ని కూడా నిర్మించబోతున్నారు మెగాస్టార్. ఇక సినీ పరిశ్రమకి ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపిస్తారు చిరు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ప్రాణదానం చేసి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోగా నిలిచారు చిరంజీవి.

ఇక ఆయనపై వచ్చే విమర్శలకి చిరునవ్వుతో సమాధానమిస్తూ శత్రువులకు కూడా స్నేహితుడిలా ఉండటానికే ఇష్టపడే వ్యక్తిత్వం ఉన్న ‘మగమహారాజు’ మన మెగాస్టార్. అందుకే ఆయన పుట్టిన రోజు అన్నా, ఆయన సినిమాల రిలీజ్ అయినా అభిమానులకి పండగే. అయన బ్యానర్లు, కటౌట్లు పెట్టి పూల దండలు, పాలాభిషేకాలు చేసి ఆయన పేరు మీద అన్నదానం, రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అభిమానులు. ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఆయన్ని ఒక్కసారి కలిస్తే చాలు అనుకునే కోట్లాది మంది అభిమానులు ఆయనకి సొంతం. అందుకే ఆయన మెగాస్టార్. మనందరి స్టార్.