Movie Theaters : తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ ఓపెన్

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బొమ్మ పడే వేళయింది. కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు బంద్‌ అవగా.. ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌ మీద సందడి నెలకొననుంది. రేపటి నుంచి తెలంగాణ, ఏపీల్లో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.

Movie Theaters : తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ ఓపెన్

Movie Theaters

Movie theaters re-open : తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బొమ్మ పడే వేళయింది. కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు బంద్‌ అవగా.. ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌ మీద సందడి నెలకొననుంది. తెలంగాణలో రేపటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సితో సిల్వర్‌ స్క్రీన్‌ తళతళ మెరిసేందుకు సిద్ధమవగా.. ఏపీలో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీకి జగన్‌ సర్కార్‌ అవకాశం ఇచ్చింది. దీంతో ఎప్పటి నుంచో పెద్ద స్క్రీన్ల మీద సినిమా చూడాలనుకుంటోన్న ప్రేక్షకులు మళ్లీ సినిమా హాళ్ల వైపు చూస్తున్నారు.

రేపటి నుంచి తెలంగాణ, ఏపీల్లో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తెలంగాణలో థియేటర్ల యజమానుల డిమాండ్లకు తగినట్టుగా ప్రభుత్వం జీవోను సవరించింది. అంతకుముందు థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయరాదని ఆదేశాలు జారీచేసింది. అయితే కరోనా దెబ్బకు కుదేలైన వ్యవస్థను కాపాడాలని థియేటర్‌ ఓనర్స్‌, సినిమా పెద్దలు ప్రభుత్వాన్ని కోరడంతో ఆ జీవోను సవరించింది. పార్కింగ్‌ ఫీజు వసూలుకు ఓకే చెప్పింది. ఇటు అన్ని వ్యవస్థలు తెరుచుకున్నందున థియేటర్లకు కూడా వంద శాతం సీటింగ్‌తో సినిమాలు నడిపించుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీలో మాత్రం 50 శాతం సీటింగ్‌తోనే సినిమా హాల్స్‌ నడిపించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది.

కొన్నాళ్లుగా థియేటర్స్ క్లోజ్ అవడంతో.. థియేటర్స్ దగ్గర ఆడియన్స్ సందడి మిస్ అయ్యింది. మూడు నెలలుగా థియేటర్స్ బోసి పోతున్నాయి. ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో మార్చి 21 నుంచి తెలంగాణ సర్కార్‌ నైట్‌ కర్ఫ్యూ విధించింది. ఇదే సమయంలో థియేటర్లు బంద్‌ అయ్యాయి. దీంతో ప్రతి శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. ప్రతి ఫ్రైడే బాక్సాఫీసు గలగలలు, ప్రేక్షకుల కిలకిలలు థియేటర్స్ దగ్గర కనిపించడం లేదు. అయితే ఈ వారం మాత్రం పాత సందడి అంతా కనిపించనుంది. థియేటర్ల ఓపెనింగ్‌తోనే కొత్త సినిమాల కళ సంతరించుకోనుంది.

రేపు ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అవ్వబోతున్నాయి. సత్యదేవ్ తిమ్మరుసు, తేజ సజ్జ ఇష్క్ మూవీలు జులై 30 రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మూడు నెలలుగా ప్రతి ఉక్రవారం బోసిపోయిన థియేటర్స్ రేపు కళకళలాడబోతున్నాయి. తిమ్మరుసు, ఇష్క్ సినిమాలతో సందడిగా మారబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాల జోష్ చూసి.. మిగతా సినిమాల రిలీజ్ డేట్స్‌ బయటకు వచ్చే అవకాశం ఉంది.

థియేటర్లు ఓపెన్‌ అవుతున్న సమయంలో ఏపీలో సినిమా టికెట్ల ధర రచ్చ మొదలైంది. ఇప్పటి వరకు కరోనాతో మూతబడ్డ థియేటర్లను తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు టికెట్‌ రేట్లు వివాదానికి దారితీశాయి. రేపటి నుంచి థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమాలు ఆడించొచ్చని ప్రకటించింది. అయితే ఇదే సమయంలో టికెట్‌ రేట్లపై విడుదల చేసిన జీవో రచ్చకు కారణమైంది.

సిటీ పరిధిలోని థియేటర్లలో టికెట్లకు ఒక రేటు, నగర శివార్లు, బీ, సీ థియేటర్లలో ఒక రేటును తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ రేట్ల ప్రకారమే టికెట్లను విక్రయించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం థియేటర్లను నడపలేమంటున్నారు ఓనర్స్‌. టికెట్‌ ధరలు, లైసెన్సింగ్‌ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై విజయవాడలో ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సమావేశం అయ్యారు. టికెట్‌ ధరలపై క్లారిటీ వచ్చాకే థియేటర్లు ఓపెన్‌ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీనిపైనే చర్చిస్తున్నారు. సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రేపటి నుంచి కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సమయంలో థియేటర్లు ఓపెన్‌ కాకుంటే ఎలా అనే మీమాంసలో ఉన్నారు నిర్మాతలు.

సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను… మరోసారి సమీక్షించాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్స్‌. నిత్యవసర వస్తువుల ధరలు నిత్యం పెరుగుతున్నా.. టికెట్‌ ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం నిబంధనలు విధించడం తగదన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందని.. ఈ క్రమంలో రేట్లపై నియంత్రణ ఇండస్ట్రీని మరింత ఇబ్బందుల పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ థియేటర్లు ఓపెన్‌ చేయాలని.. అందుకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఈ విషయాలను గమనించి ప్రభుత్వం రేట్ల జీవోను సమీక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికే అభ్యంతరాలను ప్రభుత్వానికి రాతపూర్వంగా సమర్పించిన ఎగ్జిబిటర్స్‌.. సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.