Pawan Kalyan : సిరివెన్నెల మ‌ర‌ణం తెలుగు సాహిత్యానికి, చిత్రసీమకు తీర‌ని లోటు

అక్షర త‌ప‌స్వి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. తెలుగు పాట‌ను కొత్త పుంత‌లు తొక్కించిన మ‌హ‌నీయుడు. ఆయన పాటల్లో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. ఆయన లేరనే వాస్తవం జీర్ణించుకోలేనిది.

10TV Telugu News

Pawan Kalyan : ఎన్నో తెలుగు చిత్రాలకు అద్భుతమైన పాటలను అందించిన సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సిరివెన్నుల మృతి పట్ల పవర్‌ స్టార్‌, జనసేనాని పవన్‌ కళ్యాన్‌ స్పందించారు. ”అక్షర త‌ప‌స్వి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. తెలుగు పాట‌ను కొత్త పుంత‌లు తొక్కించిన మ‌హ‌నీయుడు. ఆయన పాటల్లో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. ఆయన లేరనే వాస్తవం జీర్ణించుకోలేనిది. సిరివెన్నెల మరణం సినీ పరిశ్రమకే కాదు, సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన మరణం వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటే. నా పట్ల ఆయన ఎంతో ఆత్మీయతను కనబరిచేవారు. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయవాదం .. సామ్యవాదం వరకూ అన్ని అంశాల గురించి తన పాటల్లో చెప్పేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా” అని పవన్ ట్వీట్ చేశారు.

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల మృతికి గల కారణాలు వివరించిన కిమ్స్‌ ఎండీ డా.భాస్కర్ రావు

తెలుగు పాటను సిరివెన్నెల మరింత పరిమళింపజేశారు.. తెలుగు ప్రేక్షకులను మరింతగా పరవశింపజేశారు. ఆత్రేయ .. ఆరుద్ర .. శ్రీశ్రీ .. దేవులపల్లి .. సినారె సాహిత్యంలోని శైలి ఒక సిరివెన్నెలలోనే కనిపించేది. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం ఒక నక్షత్రమై మెరిసింది. జాబిలమ్మనే తన పాటతో నిద్రబుచ్చిన గేయ రచయిత ఆయన. అలాంటి సిరివెన్నెల ఈ లోకం నుంచి నిష్క్రమించడం పట్ల సన్నిహితులు .. సాహితీ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24న చికిత్స కోసం కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణం పట్ల సినీ ప్రముఖులు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ”అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ , బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు , స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి ” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న ఫొటోను మోదీ పోస్ట్ చేశారు.

Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..

సిరివెన్నెల అసలు పేరు శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ విలువలతో కూడిన ఎన్నో పాటలు అందించారు.

తెలుగు పాటకు నగిషీలు చెక్కిన రచయిత .. తెలుగు పదాలకు వన్నెలు దిద్దిన రచయిత.. సిరివెన్నెల సీతారామశాస్త్రి. ప్రేమ .. విరహం .. వియోగంతో కూడిన పాటలు మొదలు, సమాజాన్ని తట్టిలేపే ఉద్యమపూరితమైన పాటలను సైతం ఆయన రాశారు. ఆయన పాటల్లో వేదాంతం కనిపిస్తుంది .. తత్త్వం వినిపిస్తుంది.

×