Shankarabharanam : శంకరాభరణం.. సినిమాలకు ఆభరణం.. దక్షిణాది రాష్ట్రాల్లో సంగీతాన్ని నిద్రలేపిన సాధనం..

Shankarabharanam : శంకరాభరణం.. సినిమాలకు ఆభరణం.. దక్షిణాది రాష్ట్రాల్లో సంగీతాన్ని నిద్రలేపిన సాధనం..

Shankarabharanam :  తెలుగు సినీపరిశ్రమకు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయన మరణంతో మరోసారి టాలీవుడ్ విషాదంలో మునిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సినిమాలని గుర్తు తెచ్చుకుంటున్నారు.

భోజనంలో తినడానికి ఎన్నో పదార్థాలున్నా గోంగూరపచ్చడికి ఉన్న విలువ వేరు, పండ్లు ఎన్నున్నా మామిడిపండు విలువ వేరు.. ఇలా ప్రతిదాంట్లోనూ ఒక బెస్ట్ ఉంటుంది. కె.విశ్వనాథ్ గారి సినిమాల్లోనూ అంతే. ఆయన అందించిన ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాల్లో శంకరాభరణం ఒక్కటి ఎవరెస్టు అంత ఎత్తు. సినిమా తీసేముందు, తీశాక, రిలీజయ్యాక ఎన్నో కష్టాలు పడినా ఆయన కెరీర్ లోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలా శంకరాభరణం నిలిచింది. 1979 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా రిలీజయింది. ఇంతటి అద్భుతమైన సినిమాని పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.

అప్పుడప్పుడే సినిమాలకి కమర్షియల్ విలువలు జోడవుతున్నాయి. హీరోలకి స్టార్ హోదా వస్తుంది. పాశ్చాత్య సంగీతాలు, పాశ్చాత్య సంస్కృతి దిగడం, వాటివైపు మన జనాలు ఆసక్తి చూపించడం మొదలైంది. అలాంటి సమయంలో సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, భారతదేశం కమ్మని సంగీతం, కళలపై మనకున్న ఆరాధన.. లాంటి అంశాలతో తీసిన సినిమా శంకరాభరణం. సినిమాలో స్టార్ హీరో లేడు, స్టార్ హీరోయిన్ లేడు, ఫైట్స్ అసలే లేవు, జ్యోతిలక్ష్మి, జయమాలినిలతో సాంగ్స్, డ్యాన్సులు లేవు, వెకిలి కామెడీ సన్నివేశాలు లేవు. మరి ఆ సినిమా ఎందుకు హిట్ అయింది, ప్రేక్షకులు దానికి ఎందుకు అంత భారీ విజయం ఇచ్చారు.

ఒక ముసలివాడైపోతున్న సంగీత కళాకారుడు, ఆయన సంగీతాన్ని ఆరాధ్యంచే ఓ నృత్య కళాకారిణి.. వారిద్దరి మధ్య ఉన్న పవిత్రబంధమే ఈ సినిమా. సినిమాలో సగటు ప్రేక్షకుడు థియేటర్ కి వెళ్తే కోరుకునేవి ఏమి లేకపోవచ్చు కాని గుడికి వెళ్తే దక్కే ప్రశాంతత, ఆత్మీయులతో మాట్లాడితే వచ్చే ప్రేమానురాగాలు, కట్టిపడేసే కథనం, దేవుడి పాటలు వింటే వచ్చే హాయిదనం ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా కలిగించింది. సినిమా రిలీజ్ కి ముందు స్టార్లు లేకుండా, వాళ్ళు ఎవరో తెలీకుండా సినిమా ఏంటి అని చాలా మంది అన్నారు. సినిమా తీశాక ఇది సినిమానా అని ఎవరూ కొనడానికి కూడా ముందుకు రాక కొన్ని నెలలు ఆగిపోయింది. రిలీజయ్యాక మొదటి రోజు ఎక్కడా ఎలాంటి వార్తా లేదు. కాని రెండో రోజు నుంచి గుడి తిరునాళ్ళకు వచ్చినట్టు ప్రజలు థియేటర్స్ కి వచ్చారు.

శంకరాభరణం సినిమాని ఒక్కొక్కరు చాలా సార్లు చూశారు. ఇష్టమైన ఫుడ్ ని ఎన్నిసార్లు తిన్నా తినాలనిపించేలా ఈ సినిమాని తియేటర్ కి వెళ్లి మరీ ఒక్కొక్కరు 10 సార్లకు పైనే చూశారు. అప్పుడు ఉన్న హీరోలు, డైరెక్టర్స్, ఆర్టిసులు కూడా ఈ సినిమాని థియేటర్స్ కి వెళ్లి మరీ లెక్కలేనన్ని సార్లు చూశారు. శంకరాభరణం సినిమా మొత్తం రాజమండ్రి పరిసరాల్లోనే తీశారు. ఈ సినిమా 200 రోజులకి పైగా ఎన్నో సెంటర్స్ లో ఆడింది. ఇక నేషనల్ అవార్డులు కాక ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. మాస్కో, ఫ్రాన్స్.. ఇలా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ సినిమా స్క్రీనింగ్ అయింది. 4 నేషనల్ అవార్డులు, 7 నంది అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. ఫోర్బ్స్ బెస్ట్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇండియన్ సినిమాల్లో టాప్ 25లో సోమయాజులు నిలిచారు. ఇలా అనేక రకాల అవార్డులు, రివార్డులు ఎన్నో గెలుచుకుంది శంకరాభరణం సినిమా.

ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం పాటలు. శంకరా నాదశరీరాపరా అని సోమయాజులు పాడుతుంటే చెప్పులు విప్పి మరీ హారతులు పట్టారు శివుడికి. బ్రోచేవారెవరురా, దొరుకునా ఇటువంటి సేవా, ఓంకార నాదానుసంధానము, ఏ తీరుగా నను, రాగం తానం పల్లవి…. ఇలా ప్రతి పాట ప్రేక్షకుడిని సంగీత సామ్రాజ్యంలో ఓలలాడించింది. ఈ సినిమా పాటల క్యాసెట్స్ కోసం అప్పట్లోనే బ్లాక్ లో కొన్నారు. ఈ పాటలన్నిటికి KV మహదేవన్ సంగీతం అందిస్తే, వేటూరి గారు పాటలు రాయగా అన్ని పాటలు SP బాలసుబ్రమణ్యం గారే పాడారు. ఫీమేల్ వాయిస్ లు వాణి జయరాం పాడగా ఓ రెండు పాటలను మాత్రం S జానకి పాడారు.

ఈ సినిమాలో పాశ్చాత్య సంగీతానికి యువత డ్యాన్సులు వేస్తూ సోమయాజులు గారికి అడ్డంకి కలిగిస్తే వారితో వాదన పెట్టుకొని మన సాంప్రదాయ సంగీతాన్ని వాళ్లకి రుచి చూపించిన సీన్ చాలా హైలెట్. చివర్లో పిల్లవాడు వచ్చి పాట పాడితే విశ్వనాధ్ మంజు భార్గవి వైపు చూసినప్పుడు ప్రేక్షకుడి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఇలా ఒక్కో సీన్ ఒక్కో ఆణిముత్యం సినిమాలో. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తల్లితండ్రులంతా తమ పిల్లల్ని సంగీత పాఠశాలలకు పంపించారు. మన తెలుగులోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సినిమాతో సంగీతానికి విలువ పెరిగింది. సంగీతానికి వైభవం వచ్చింది. ఓ రకంగా సంగీతానికి తెలుగురాష్ట్రాల్లో ప్రాణం తెచ్చిన సినిమా శంకరాభరణం.

Swathi Muthyam : ఇండియన్ గవర్నమెంట్ అధికారికంగా ఆస్కార్ లిస్ట్ కి పంపిన ఏకైన తెలుగు సినిమా స్వాతిముత్యం..

ఆయన ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నా శంకరాభరణం సినిమా మాత్రం నేటికీ ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలా మిగిలింది తెలుగు వారికి. 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా రిలీజయి తమిళ్, తెలుగులో భారీ విజయం సాధించి మిగిలిన భాషల్లో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు అని సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన దగ్గర్నుంచి సినిమా అంటే ఇది అనే ప్రయాణం సాగించింది శంకరాభరణం. ఆ సినిమా రిలీజయి నిన్నటికి 43 ఏళ్ళు అయింది. డైరెక్టర్ గా కె.విశ్వనాథ్ కి మరింత పేరు తెచ్చిన ఆయన స్పెషల్ సినిమా శంకరాభరణం అయిన డేట్ ఫిబ్రవరి 2నే ఆయన మరణించడం నిజంగా దైవలీలే.

ఒక సినిమా ప్రేక్షకులని కన్నీళ్లు పెట్టిస్తుంది, ఒక సినిమా ప్రేక్షకుల మనసులని హత్తుకుంటుంది, ఒక సినిమా జ్ఞాపకాలని ప్రేక్షకులు జీవితాంతం మోస్తారు. తమతో పాటు కొన్ని సినిమా తాలూకు ఆనందాన్ని ఇంటికి తీసుకెళ్తారు. కొన్ని సినిమా పాటలు ప్రతి ఇంట్లో వినిపించాయి, కొన్ని సినిమాలని ఆరాధిస్తారు, కొన్ని సినిమాలు మనతో మాట్లాడతాయి, కొన్ని సినిమాలు ఎప్పటికి నిలిచిపోతాయి.. ఇవన్నీ ఒక సినిమాకే జరిగితే అదే శంకరాభరణం.