14నెలల్లో 1700మంది బిడ్డల జననం.. ప్రసవాలకు కేరాఫ్ గా 108 అంబులెన్సులు

14నెలల్లో 1700మంది బిడ్డల జననం.. ప్రసవాలకు కేరాఫ్ గా 108 అంబులెన్సులు

1,700 babies delivered in 108 ambulances: కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్సులు ప్రసవాలకు కేరాఫ్‌గా మారాయి. గత 14 నెలల కాలంలో 108 అంబులెన్స్ లలో 1700మంది బిడ్డలు జన్మించారు. అంబులెన్స్ లోనే ప్రసవాలు జరిగాయి. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 108 ఆరోగ్య కవచ అత్యవసర స్పందన అంబులెన్స్ లు నడుస్తున్నాయి.

“ప్రతి నెల మా అంబులెన్స్‌లలో 150 కి పైగా పిల్లలు ప్రసవమవుతున్నారు. మాకు వచ్చే కాల్స్‌లో దాదాపు 35 నుంచి 40 శాతం గర్భధారణకు సంబంధించినవి. ఆసుపత్రులకు చాలా దూరంగా ఉండే మారుమూల ప్రాంతాలు, రోడ్డు సౌకర్యం లేని చోట్ల, ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లోనూ మా అంబులెన్సులలో ప్రసవాలు చేశాం” అని 108 అంబులెన్స్ బెంగళూరు జిల్లా ప్రొగ్రామ్ మేనేజర్ మహమ్మాద్ ఆసిఫ్ తెలిపారు.

ఈ అంబులెన్సలన్నీ ఉచిత ఎమర్జెన్సీ సర్వీసులు. ఈ వాహనాల్లో నిత్యం ప్రసవానికి ఉపయోగించే కిట్ అంటుంది. ఓ స్టాఫ్ నర్సు(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్-EMT అని కూడా అంటారు) కచ్చితంగా ప్రతి అంబులెన్స్ లో ఉంటారు. అతడు లేదా ఆమె.. స్టాఫ్ నర్సుగా ఉంటారు. వీరికి జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ కోర్సులో మూడున్నరేళ్లు శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో 1000మంది ఈఎంటీలు ఉండగా, వారిలో అత్యధికులు పురుషులు కావడం గమనార్హం. బళ్లారి, రాయ్ చూర్, కలబుర్గి ప్రాంతాల్లో అంబులెన్స్ లో ఎక్కువ ప్రసవాలు నమోదయ్యాయి.

గర్భిణులను ఆసుపత్రులకు చేర్చేందుకు ఈ అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. అయితే, చాలా కేసుల్లో, ఆసుపత్రికి వెళ్లేలోపు అంబులెన్స్ లోనే సుఖ ప్రసవాలు జరిగిపోతున్నాయి. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉంటున్నారు. ఈఎంటీలుగా అంబులెన్స్ లో పురుషులు ఉండటం కొంత ఇబ్బంది కలిగించే విషయమే. కొంతమంది గర్బిణులు ఈ అంబులెన్స్ లో వెళ్లేందుకు ఇష్టపడరు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు నచ్చచెప్పడంతో గర్భిణులు అందులో వెళ్లేందుకు అంగీకరిస్తారు.