Corona vaccines stolen: 1710 కరోనా టీకాలు చోరీ

Corona vaccines stolen: 1710 కరోనా టీకాలు చోరీ

1710 Doses Of Covid 19 Vaccine Stolen

1710 doses of Covid-19 vaccine stolen  : కరోనా సెకండ్ వేవ్ తో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చిందనే సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండాపోయింది. మీకు నన్ను ఖతం చేయటానికి టీకా తీసుకొస్తే నేను నా సత్తా ఏంటో చూపిస్తానన్నట్లుగా..మీకంటే ఓ అడుగు నేను ముందే ఉంటానన్నట్లుగా కరోనా మహమ్మారి రెండో విడత కల్లోలం సష్టిస్తోంది.

ఈక్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ తో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరీ చెప్పాలంటే గంట గంటకు కరోనా మృతులు పెరుగుతున్నారు. మతదేహాలను ఖననం చేయటానికి శ్మశానాలు కూడా సరిపోవటం లేదు అంటే ఈకరోనా కోరలు ఎంతగా చాస్తోందో ఊహిస్తేనే వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తోంది..

ఈక్రమంలో ఓ పక్క పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదురవుతుంటే..మరోపక్క టీకాల డోసులు చోరీలు జరుగుతున్న ఘటనలు జరుగుతున్నాయి. హరియాణాలో కొందరు దుండగులు వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లడం కలకలం సృష్టించింది. జింద్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 1,710 కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా డోసుల్ని దుండగులు చోరీ చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో టీకా డోసులు లేని పరిస్థితి ఏర్పడింది.

జింద్ జిల్లాలోని పీపీ సెంటర్‌ జనరల్‌ ఆస్పత్రిలోని పిపిసి సెంటర్ నుంచి గురువారం (ఏప్రిల్ 22,2021) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరోనా టీకాల చోరీ చేశారు.మొత్తం 1,710 టీకా డోసుల్ని ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఇతర మందులతో పాటు నగదు కూడా ఉంది. అయినా వాటిని చోరులు అస్సలు ముట్టుకోకపోవటం గమనించాల్సిన విషయం. కేవలం కరోనా వైరస్‌ టీకాలే లక్ష్యంగా ఈ చోరీ జరిగినట్లు పక్కాగా తెలుస్తోంది. చోరికీ గురైన వ్యాక్సిన్ లలో 1270 కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఉండగా మిగిలినవి కోవాక్సిన్ వ్యాక్సిన్లు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.

ఆస్పత్రిలో జరిగిన ఈ చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో సంబంధిత ఆస్పత్రి వర్గాలు వ్యాక్సిన్‌ నిల్వ చేసే ప్రదేశంలో సీసీ కెమెరాలు గానీ, లేదా గార్డుని గానీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.