మీలో ఈ 4 సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే రోగనిరోధక వ్యవస్థ బలహీన పడినట్టే

  • Published By: naveen ,Published On : August 20, 2020 / 02:56 PM IST
మీలో ఈ 4 సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే రోగనిరోధక వ్యవస్థ బలహీన పడినట్టే

ప్రతి మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమైనంది. అంటువ్యాధి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ నిరంతరం పని చేస్తుంది. రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. అలాంటి రోగనిరోధక వ్యవస్థను మెయింటేన్ చేయాలంటే ఒక్కటే మార్గం. అదే సమతుల్యమైన డైట్, ఆరోగ్యకరమైన జీవన విధానం.



ఒత్తిడి, అస్థవ్యస్థ జీవనశైలి, అతి మద్యపానం.. ఇవి రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. రోగనిరోధక శక్తి బలహీనం అయితే రోగాలు వచ్చే ఆస్కారం ఏర్పడుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారిపై కొవిడ్-19 తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్టు స్టడీలో తేలింది. ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ ఎలా ఉందని తెలుసుకోవడం కీలకంగా మారింది. రోగనిరోధక వ్యవస్థ బలహీన పడిందనే విషయం ఎలా తెలుస్తుంది? అనే సందేహం అందరిలోనూ ఉంది. దానికి సమాధానమే 4 సంకేతాలు. మీలో ఈ నాలుగు సంకేతాలు కనిపిస్తుంటే, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నట్టే అని నిపుణులు చెబుతున్నారు.

1. తరుచుగా అంటువ్యాధుల బారిన పడటం, కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం(Frequent infections and longer healing time)
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారింది అని చెప్పడానికి ప్రధాన సంకేతం ఇది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ హానికర బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లను సక్రమంగా నిర్మూలించలేదు. ఫలితంగా తరుచుగా అంటువ్యాధుల బారిన పడతారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఏడాదిలో మూడుసార్ల కన్నా ఎక్కువగా సాధారణ జలుబు వస్తే, దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంటే, మన రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదని చెప్పడానికి ఇది సంకేతం. అలాగే ఏవైనా గాయాలు లేదా కోతలు అయినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నట్టు అయితే, వాటిని నయం చేయడానికి శరీరం చాలా సమయం తీసుకుంటుంది. ఇక ఒక ఏడాదిలో రెండుసార్ల కన్నా ఎక్కువగా యాంటీబయోటిక్ చికిత్స తీసుకోవాల్సిన అవసరం వచ్చినా, స్వల్ప బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు తీవ్రంగా మారినట్టు అయితే, దాని అర్థం ఇమ్యూనో డెఫీషన్సీ డిజార్డర్ అని అమెరికన్ అకాడమీ ఆఫ్ అలర్జీ ఆస్తమా అండ్ ఇమ్మునాలజీ రిపోర్టులు చెబుతున్నాయి.



2. అధిక అలసట(Excessive tiredness)
అధిక అలసట కూడా రోగనిరోధక శక్తి బలహీన పడింది అని చెప్పడానికి ఓ సంకేతం. మీరు నిరంతరం అలసటగా ఫీల్ అవుతున్నారు అంటే అలర్ట్ కావాల్సిందే. అదనపు గంటలు నిద్రపోతున్నా ప్రయోజనం లేదు అంటే, రోగనిరోధక వ్యవస్థ బలహీన పడినట్టే అర్థం. శరీరంలో అన్నీ సక్రమంగా పని చేయడానికి శక్తి అవసరం. అయితే బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నప్పుడు మరింత శక్తి అవసరం. అలాంటి సందర్భంలో బాగా అలసిపోయిన భావన నిరంతరం కలుగుతుంది.



3. కడుపులో సమస్యలు(Stomach issues)
జాన్స్ హాప్కిన్స్ ప్రకారం, రోగనిరోధక వ్యవస్థలో పెద్ద భాగం గట్లలో(జీర్ణ వ్యవస్థల్లో ఉండే సూక్ష్మజీవి) ఉంటుంది. మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లో పెద్ద సంఖ్యలో మంచి బ్యాక్టిరీయా ఉంటుంది. అది యాంటీబాడీలు, ఇతర ఉపయోగకర పదార్ధాలు విడుదల చేస్తుంది. అవి రోగనిరోధకత నిర్వహణకు ఉపయోపడతాయి. గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యత ఉన్నా లేదా తక్కువ గట్ బ్యాక్టీరియా ఉన్నా, తరుచుగా రోగాల బారిన ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధులు మరియు వివిధ తాపజనక పరిస్థితులకు గురి చేస్తుంది. జీర్ణక్రియలో గట్ బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. తరుచుగా కడుపు సమస్యలు (మలబద్దకం లేదా విరేచనాలు) వస్తున్నాయి అంటే, రోగనిరోధక వ్యవస్థను తనిఖీ చేసుకోండని చెప్పడానికి అది ఓ సంకేతం.



4. నోటి పూతలు(Mouth ulcers)
తరుచుగా నోటి పూతలు వస్తున్నా అప్రమత్తం కావాల్సిందే. నోటి పూతలకు అనేక కారణాలు ఉన్నాయి. పొరపాటున నాలుకను లేదా చెంపను కొరుక్కున్నప్పుడు నోటి పూతలు వస్తాయి. అదే సమయంలో నోటి పూతలకు బలహీనపడ్డ రోగ నిరోధక వ్యవస్థ కూడా కారణం కావొచ్చు. అలాగే నోటి పూతలకు ఒత్తిడి కూడా మరో కారణం. స్థిరమైన ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.