బీజేపీ కూడా! : అన్నాడీఎంకే-పీఎంకే మ‌ధ్య కుదిరిన పొత్తు

బీజేపీ కూడా! : అన్నాడీఎంకే-పీఎంకే మ‌ధ్య కుదిరిన పొత్తు

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొన‌సాగుతున్నాయి. గ‌తంలో ఉన్న విభేధాల‌ను ప‌క్క‌న‌బెట్టి పొత్తుల‌కు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. మంగ‌ళ‌వారం ప‌ట్ట‌లి మ‌క్క‌ల్ క‌చ్చి(పీఎంకే) నేత ఎస్ రామ‌దాస్ తో అన్నాడీఎంకే చీఫ్, డిప్యూటీ సీఎం ప‌న్నీరుసెల్వం  చ‌ర్చ‌లు జ‌రిపారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే సీట్ల విష‌య‌మై పీఎంకే నేత స‌మ‌క్షంలో మీడియాకు ప‌న్నీరు సెల్వం తెలిపారు. 

 2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ లో పీఎంకేకి ఆరు లోక్ స‌భ సీట్లు, ఒక రాజ్య‌స‌భ సీటు కేటాయించిన‌ట్లు  ఆయ‌న‌ తెలిపారు.ఉప ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న 21 అసెంబ్లీ స్థానాల్లోనూ అన్నాడీఎంకేకి పీఎంకే మ‌ద్ద‌తుంటుంద‌ని  తెలిపారు. పీఎంకే నేత రామ‌దాస్ మాట్లాడుతూ..చ‌ర్చ‌ల సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి పీఎంకే పెట్టిన ప‌లు ష‌ర‌తుల‌కు అన్నాడీఎంకే అంగీక‌రించింది. ఈ డిమాండ్లు త‌మిళ‌నాడు హ‌క్కుల‌కు సంబంధించిన‌వి. ఇరు పార్టీలు వీటికి ఒప్ప‌కోవ‌డంతో కూట‌మిని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 

 ఉత్త‌ర త‌మిళ‌నాడులో, ప్ర‌త్యేకంగా ఓబీసీ వ‌న్నియార్ క‌మ్యూనిటీలో పీఎంకేకి మంచిప‌ట్టు ఉంది. 1999నుంచి రాష్ట్రంలో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పీఎంకేకి 5నుంచి 10శాతం ఓట్లు పోల‌య్యాయి. 2009 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా అన్నాడీఎంకే-పీఎంకేలు క‌లిసి పోటీ చేశాయి. 39 స్థానాలున్న త‌మిళనాడులో అన్నాడీఎంకేకి 37, పీఎంకేకి,బీజేపీ చెరో ఒక ఎంపీ ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో పీఎంకే ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉంది. పీఎంకే ఎంపీ అన్బుమ‌ణి రామ‌దాస్ ఎంపీగా గెలిచిన‌ప్ప‌టికీ మోడీ క్యాబినెట్ లో చోటు ద‌క్క‌లేదు. 

మ‌రోవైపు అన్నాడీఎంకే-పీఎంకే కూట‌మిలో బీజేపీ కూడా చేరే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన పొత్తు ఓకే చేసుకొని మంచి జోష్ మీద‌నున్న క‌మ‌ల‌ద‌ళం త‌మిళ‌నాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని అధిక స్థానాలు కైవ‌సం చేసుకోవాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. అన్నాడీఎంకేతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు మంగ‌ళ‌వారం కేంద్ర‌మంత్రి పియూష్ గోయ‌ల్ చెన్నైకి చేరుకొన్నారు. అన్నాడీఎంకే నేత‌ల‌తో చ‌ర్చల అనంత‌రం పొత్తుపై ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది.