Amit Shah – Chandrababu Meet : పాతమిత్రులకు బీజేపీ గాలం.. చంద్రబాబు, అమిత్‌షా భేటీ వెనుక వ్యూహామేంటి?

Amit Shah – Chandrababu Meet : పాతమిత్రులకు బీజేపీ గాలం.. చంద్రబాబు, అమిత్‌షా భేటీ వెనుక వ్యూహామేంటి?

Amit Shah – Chandrababu : జాతీయ రాజకీయాల్లో (National Politics) సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాజకీయ పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి పార్టీలు. నిన్నమొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పావులు కదిపితే.. ఇప్పుడు బీజేపీ (BJP) కూడా రంగంలోకి దిగింది. తన పాతమిత్రులను.. తటస్థులను రా.. రమ్మని పిలుస్తోంది కమలదళం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. టీడీపీ అధినేత చంద్రబాబు కలయిక ఇందులో భాగమే.. బాబు, షా భేటీలో ఏం మాట్లాడుకున్నా.. తన పాతమిత్రుడిని ఐదేళ్ల తర్వాత ఢిల్లీ పిలుపించుకున్న బీజేపీ.. జాతీయ రాజకీయాల్లో మరోసారి హాట్‌ డిబేట్‌ (hot debate) కు తెరతీసింది.

సెంట్రల్‌లో మారుతున్న పొలిటికల్ సీన్
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రెండు ప్రధాన జాతీయ పార్టీల ఆధ్వర్యంలోని రెండు కూటముల్లో మార్పులు.. చేర్పులకు పావులు కదుపుతున్నాయి. కర్ణాటక ఎన్నికల (Karnataka Election) నుంచి సెంట్రల్‌లో పొలిటికల్ సీన్ చాలా వేగంగా మారుతోంది. కాంగ్రెస్ బలపడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తుండటంతో అధికార బీజేపీ జాగ్రత్త పడుతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీలను కలుపుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే పనిచేస్తోంది. కేంద్రంలో అధికారం సుస్థిరం చేసుకోవాలని.. వరుసగా మూడోసారి ఎన్నికై రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్‌షాను రంగంలోకి దింపారు. బీజేపీ ట్రబుల్ షూటర్ (troubleshooter) అయిన షా.. ప్రధాని నుంచి ఆదేశాలు అందగానే కార్యక్షేత్రంలో దిగిపోయారు.

2024లో ఎవరు గెలిచినా రికార్డే
2024లో జరిగే ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లకు చాలెంజ్‌గా మారాయి. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ఇంత సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉండటం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే సమయంలో కాంగ్రెసేతర పార్టీ కూడా ఇంత సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో లేదు. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచినా అదో రికార్డే. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రతిభతోపాటు ఆయన శక్తిసామర్థ్యాలకు ఇది పరీక్ష కాలం. ఇక ప్రధాని మోదీ ఇప్పటికే దేశ రాజకీయాల్లో అజేయశక్తిగా నిలిచారు. మోదీ సారథ్యంలో బీజేపీ గత తొమ్మిదేళ్లుగా కనీవినీ ఎరుగని విజయాలు సాధించింది. రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి రావడమే కాదు.. వరుసగా ఒక్కోరాష్ట్రంలోనూ పాగా వేస్తూ పటిష్టస్థితికి చేరుకుంది బీజేపీ.

బీజేపీలో కలవరం
ఇంత పటిష్టంగా ఉన్న బీజేపీ.. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలతో షాక్‌కు గురైంది. ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. ఇదే కాదు.. అంతకు ముందు పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందిస్తున్నాయి. ఈ విషయమే బీజేపీని కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ కూటమి బలోపేతమవుతుందనే సంకేతాలకు విరుగుడు చర్యలు ప్రారంభించింది బీజేపీ.

Also Read: అర్ధరాత్రి అమిత్ షాతో రెజ్లర్ల భేటీ.. ఆ విషయంపై రెజ్లర్లకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

పాతమిత్రులు.. తటస్థులకు గాలం వేస్తున్న బీజేపీ
జాతీయ రాజకీయాలను బేరీజు వేసుకుంటున్న కమలదళం.. తటస్థులకు.. తన పాతమిత్రులకు స్నేహహస్తం చాస్తోంది. చంద్రబాబుతో అమిత్‌షా భేటీకావడం ఇందులో భాగమే. 2018 వరకు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల బయటకు వచ్చేశారు. 2019లో ఏపీలో ఘోర పరాజయం ఎదురుకావడం.. ఆ తర్వాత నుంచి రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్‌తో జట్టుకట్టడం 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా దెబ్బతీసింది. 2019లో ఏపీలో కూడా అంతేరీతిలో దెబ్బతగలడంతో బాబు జాతీయ రాజకీయాలపై సైలెంట్ అయిపోయారు. వచ్చే ఏడాది జరిగే ఏపీ ఎన్నికల్లో గెలవాలంటే కేంద్రం సహకారం అవసరం అవడంతో చాలా కాలం నుంచి చంద్రబాబు బీజేపీతో స్నేహం కోసం ఎదురుచూస్తున్నారు. అదేసమయంలో ఇన్నాళ్లు చంద్రబాబు అవసరం లేదన్నట్లు వ్యవహరించిన బీజేపీ.. ఇప్పుడు షడన్‌గా వ్యూహం మార్చుకుంది.

Also Read: మూడేళ్లు ఏం చేశావ్.. సొంత పార్టీ నేతలే నిన్ను చీకొడుతున్నారు..

ఏపీలో బీజేపీకి అంతంతమాత్రమే బలం ఉంది. ఇప్పట్లో ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కమలదళం లేదు. కానీ.. ఏపీ ఎంపీల బలం కేంద్రంలో అవసరం. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ వైసీపీ తటస్థ వైఖరి అనుసరిస్తుంది. అవసరమైనప్పుడు బీజేపీకి సహకరిస్తూ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు తన పాత మిత్రుడైన చంద్రబాబును మళ్లీ ఎన్‌డీఏలోకి ఆహ్వానిస్తే ఏపీలోని రెండు పార్టీలు తన గుప్పెట్లో ఉంటాయని లెక్కలు వేసుకుంటోంది కాషాయ పార్టీ. కర్ణాటకలో పరాజయం ఎదురైనా అక్కడ కోల్పోయిన బలం ఏపీలో సమీకరించుకోవచ్చని ప్లాన్ చేసుకుంటోంది. ఈ దిశగానే చంద్రబాబు, అమిత్‌షా భేటీ జరిగిందని అంటున్నారు.

ప్రతిపక్షాల ఏకీకరణతో బీజేపీ అలర్ట్.. వివరాలకు ఈ వీడియో చూడండి..