Anti virus mask: కరోనాను ఖతం చేసే హైటెక్ మాస్కు తయారు చేసిన 17 ఏళ్ల యువతి..శెభాష్ అన్న గూగుల్

Anti virus mask: కరోనాను ఖతం చేసే హైటెక్ మాస్కు తయారు చేసిన 17 ఏళ్ల యువతి..శెభాష్ అన్న గూగుల్

Anti Virus Mask

Anti virus mask : 17 ఏళ్ల అమ్మాయి ఏం చేస్తుంది. పైగా ఈ కరోనా రోజుల్లో ..ఆన్ లైన్ క్లాసులు వింటూ..అబ్బా ఏందిరా బాబూ..కాలేజీకి పోవటానికి లేదు..ఫ్రెండ్స్ తో ఓ సరదా లేదు పాడూ లేదు అనుకుంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి మాత్రం ‘కరోనా మహమ్మారిని ఖతం చేసే..హైటెక్ మాస్క్’ తయారు చేసి గూగుల్ తో శెభాష్ అనిపించుకుంది. బెంగాల్ కు చెందిన దిగాంతిక బోస్ అనే17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతోంది. సైంటిస్టు కావాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. ఇంత చిన్న వయస్సులోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని కరోనా వైరస్ నిరోధక ఇన్హేలర్ మాస్క్‌ను తయారు చేసింది.

17 ఏళ్ల వయస్సులోనే ప్రపంచాన్ని పట్టి పీడిసతున్న కరోనా వైరస్‌ను నాశనం చేసే మాస్కును రూపొందించడం గొప్ప విషయమని ప్రముఖులు సైతం దిగాంతికను ప్రశంసిస్తున్నారు. బెంగాల్ లోని తూర్పు బుర్ద్వాన్‌కు చెందిన దిగాంతిక బోస్ ఆవిష్కరణను గూగుల్ సైతం గుర్తించింది. ప్రపంచంలోని పది స్ఫూర్తిదాయకమైన డిజైన్లలో ఈ మాస్కును చేర్చి..దిగాంతికను ప్రశంసించింది గూగుల్.

ఈ యాంటీ వైరస్ మాస్కులో ఒక ప్రత్యేకమైన కెమికల్ ఛాంబర్ ఉంటుంది. ఒకవేళ గాలిలో వైరస్ ఉంటే.. మాస్కులో ఉండే కెమికల్ చాంబర్ దాన్ని నాశనం చేస్తుంది. ఆ మాస్కు పెట్టుకున్నవారి చెంతకు కూడా వైరస్ రాకుండా నిరోధిస్తుంది. ఇదే విధంగా కోవిడ్ బారిన పడిన వ్యక్తి నుంచి విడుదలయ్యే వైరస్ కూడా బయటకు రాకుండా మాస్కులోని వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందీ మాస్కు. దీంతో ఈ వైరస్ గాలిలో కలిసిపోకుండా చేస్తుంది. ఈ మాస్కులో ఎయిర్ అయనైజర్ కూడా ఉంది. ఇది గాలిలోని దుమ్ము, ఇతర మలినాలను డివైడ్ చేసి..స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది.

ఈ హైటెక్ మాస్కు ఎలా పనిచేస్తుందంటే..
ఈ హైటెక్ మాస్కు గురించి దిగాంతిగా వివరిస్తూ..గాలిలో ఉండే వైరస్‌ను గుర్తించే నెగిటివ్ అయాన్, దాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.కాకపోతే..ఈ మాస్కు అన్ని రకాల వైరస్‌లను నిర్వీర్యం చేయకపోవచ్చు. ఈ మాస్కు తయారీలో బ్యాటరీతో నడిచే సర్క్యూట్‌, రెండు ఫిల్టర్ ట్యూబ్‌లు, సబ్బు నీటిని ఉపయోగించానని మాస్కులోని వ్యవస్థ పనితీరును దిగాంతిక తెలిపింది. ‘బ్యాటరీతో నడిచే సర్క్యూట్ ద్వారా నెగిటివ్ అయాన్లు ఉత్పన్నమవుతాయి.

ఇవి మాస్కులోకి వచ్చే గాలిలోని దుమ్ము, వైరస్‌లను నాశనం చేస్తాయి. అనంతరం సబ్బు నీరు మిగిలిన క్రిములను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. మాస్కులో సబ్బు నీరు రెండు ట్యూబ్‌ల మధ్య ఉంటుంది. మాస్కు ధరించినవారు శ్వాస తీసుకున్నప్పుడు.. గాలి ట్యూబ్‌ల నుంచి వెళ్తుంది. ఈ క్రమంలో అది సబ్బు నీటితో కాంటాక్ట్ అవుతుంది. ఫలితంగా గాలిలో మిగిలిన వైరస్‌లు కూడా నాశనం అవుతాయి’ అని దిగాంతిక చెప్పుకొచ్చింది.

దిగాంతిక రూపొందించిన మాస్కును గుర్తించిన గూగుల్
కోవిడ్-19 రోగుల చికిత్సలో వాడనున్న అస్త్రంగా ఈ ప్రత్యేకమైన ‘ఎయిర్ ప్రొవైడింగ్ అండ్ వైరస్ డిస్ట్రాయింగ్’ మాస్కు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆమె డిజైన్ చేసిన ఈ మాస్కు జాతీయ పోటీల్లో సైతం షార్ట్ లిస్ట్ అయింది. దిగాంతిక ప్రయోగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అభినందించింది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసే అంశంపై చర్చలు కూడా జరుగటం గమనించాల్సిన విషయం. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ యాంటీ వైరస్ మాస్కును ప్రపంచంలోని టాప్ 10 స్ఫూర్తిదాయక డిజైన్లలో ఒకటిగా గుర్తించడం విశేషం.

దిగాంతిక ఈస్ట్ బుర్ద్వాన్‌లోని మేమారి వి.ఎమ్ ఇన్స్టిట్యూషన్‌లో పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె ఇప్పటికే 11 ఆవిష్కరణలకు ప్రాణం పోసిన దిగాంతికి చిన్నప్పటినుంచి తనదైన శైలిలో ఆవిష్కరణలు చేస్తోంది. 4th క్లాస్ లోనే 360 డిగ్రీల కోణంలో చూడగలిగే కళ్లద్దాలను తయారు చేసి పలువురితో శెభాష్ అనిపించుకుంది. సుందర్‌బన్ ప్రాంతంలోని ప్రజలు పులుల వేటకు బలికాకుండా ఉండేందుకు వీటిని తయారు చేసింది. ఆ తరువాత దిగాంతికి ఖాతాలో ఎన్నో ఆవిష్కరణలు చేరాయి.