అచ్చుగుద్దారు : Youtube చూసి దొంగనోట్లు తయారు చేసిన స్టూడెంట్స్

  • Published By: madhu ,Published On : September 20, 2019 / 06:13 AM IST
అచ్చుగుద్దారు : Youtube చూసి దొంగనోట్లు తయారు చేసిన స్టూడెంట్స్

వారు గ్రాడ్యుయేట్లు. డబ్బులు సులభంగా సంపాదించాలని భావించి అడ్డదారులు తొక్కారు. నకిలీ నోట్లను తయారు చేసి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. నకిలీ రూ. 200 నోట్లను చెలామణి చేస్తూ..గ్రామీణ ప్రాంతాల్లో దుకాణదారులను మోసం చేసిన వీరిని ఉడిపి పోలీసులు అరెస్టు చేశారు. వీరు బీబీఎం గ్రాడ్యుయేట్లు కావడం విశేషం. యూ ట్యూబ్‌లో వీడియోలు చూసి ఫేక్ కరెన్సీని ముద్రించారని పోలీసులు వెల్లడించారు. అనుమానం వచ్చిన ఓ దుకాణ దారుడు పోలీసులకు కంప్లయింట్ చేశాడు. సబ్ ఇన్స్‌పెక్టర్ నసీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు. కర్కాల పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు..చేతన్ గౌడ, అర్పిత నావెల్‌లు దేవన్ గిరి ప్రాంతానికి చెందిన వారు. వీరి వద్ద నుంచి వాహనం, నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసుల వివరాల ప్రకారం…45 రోజుల్లో నకిలీ నోట్లను ముద్రించాలని అనుకున్నారని, చిన్న దుకాణాలకు వెళ్లి..రూ. 50 విలువైన సామాగ్రీని కొనుగోలు చేసి ఫేక్ రూ. 200 నోట్ ఇచ్చే వారన్నారు. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఉడిపి జిల్లాలోని కార్కల తాలూకాలోని ఓ మెడికల్ షాపు వద్దకు వచ్చారు. రూ. 43 ఖరీదు చేసే ఆయింట్ మెంట్‌ను కొనుగోలు చేసి గతంలో లాగానే రూ. 200 ఫేక్ నోట్ ఇచ్చారు. షాపు యజమాని సుధీర్ శెట్టికి అనుమానం వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లాడు. ఇది చూసిన వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. సాయంత్రం 5గంటల సమయంలో కౌప్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో పట్టుకున్నారు. మైసూరు, దేవనగిరి, బెల్గావీ ప్రాంతాల్లో వీరు ఫేక్ న్యూస్ పంపిణీ చేశారని పోలీసులు వెల్లడించారు.