బెంగాల్ హింసపై మోడీ ఆందోళన..గవర్నర్ కు ఫోన్

ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడిన తర్వాత జ‌రిగిన హింస‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ

బెంగాల్ హింసపై మోడీ ఆందోళన..గవర్నర్ కు ఫోన్

Bengal Governor Modi

Bengal Governor ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడిన తర్వాత జ‌రిగిన హింస‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ మంగళవారం బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ఫోన్ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌రే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. రాష్ట్రంలో దిగ‌జారుతున్న శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ప్ర‌ధాని తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ఆ ట్వీట్‌లో తెలిపారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దహనకాండ, దోపిడీలు, హత్యలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రికి తెలిపానన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సంబంధితులు తక్షణం చర్యలు ప్రారంభించాలన్నారు.

అయితే ప్ర‌ధాని మోడీ ఈ స్టంట్లు ఆపి ముందు ఇండియాలో కొవిడ్ ప‌రిస్థితుల‌పై దృష్టి సారించాల‌ని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రైన్ ట్వీట్ చేశారు. అందులో ఢిల్లీలో ల్యాండైన 300 ట‌న్నుల కొవిడ్ ఎమ‌ర్జెన్సీ స‌ర‌ఫ‌రాలు ఏమ‌య్యాయి అన్న ఓ న్యూస్ రిపోర్ట్‌ను పోస్ట్ చేశారు. కొవిడ్ ప‌రిస్థితులు లేదా దీనిపై ముందు దృష్టి సారించండి అని ప్ర‌ధానికి సూచించారు.

ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో తృణ‌మూల్ కాంగ్రెస్ గెలిచిన త‌ర్వాత బెంగాల్‌లో హింస చెల‌రేగింది. ఈ హింస‌లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఆరంబాగ్‌లోని బీజేపీ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. తృణమూల్ గూండాలే ఈ పనికి ఒడిగట్టారని బీజేపీ ఆరోపించింది. మ‌రోవైపు ఈ హింస‌లో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను క‌ల‌వ‌డానికి ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. రెండు రోజుల పాటు బెంగాల్‌లో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంది.

ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ లో విపక్షాలే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సోమవారం కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసాకాండపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.