Bharat Bandh:వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా..గేదెలపై ఎక్కి నిరసన..

  • Published By: nagamani ,Published On : September 25, 2020 / 11:30 AM IST
Bharat Bandh:వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా..గేదెలపై ఎక్కి నిరసన..

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు, యూనియన్లు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానాలోని 31 రైతు సంఘాలు పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా బీహార్ లోని దర్భాంగాలో నిరసనకారులు గేదెలు ఎక్కి వాటిని స్వారీ చేస్తు నిరసన తెలుపుతున్నారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ కేంద్రం ఏ మాత్రం వెనక్కితగ్గటంలేదు. బిల్లును పార్లమెంట్‌లో పాస్ చేసింది. ఈ క్రమంలో కేంద్రం తీరుకు నిరసనగా దేశంలోని సుమారు 25కి పైగా రైతు సంఘాలు భారత్ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానాలోని 31 రైతు సంఘాలు పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి.


ఆల్ ఇండియా ఫార్మర్స్ యూనియన్, భారతీయ కిసాన్ యూనియన్, ఆల్ ఇండియా కిసాన్ మహాసంఘ్, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా ఇవాళ భారత్ బంద్‌ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. అంతేకాదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని రైతు సంఘాలు కూడా బంద్‌కు మద్దతు పలికాయి. ఈనెల 25న షట్ డౌన్ చేయాలని సూచించాయి.


వీరికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, నేషనల్ డ్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, హింద్ మజ్దూర్ సభ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సెంటర్, ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా రైతుల భారత్ బంద్‌కు మద్దతు పలికాయి. పలువురు రైతు సంఘాల నాయకులు రైలు పట్టాలపై పడుకుని తమ నిరసన తెలుపుతున్నారు. అమృత్‌సర్‌లో రైల్ రోకో చేస్తున్న రైతు సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు.