భారత్‌ బయోటెక్‌…కోవ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌

  • Published By: bheemraj ,Published On : November 17, 2020 / 08:19 AM IST
భారత్‌ బయోటెక్‌…కోవ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌

Covaxin Third Clinical Trials : భారత్‌లో మొట్టమొదటి సారిగా… భారీ స్థాయిలో కోవిడ్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. కోవ్యాక్సిన్‌ పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ ట్రయల్స్‌ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. దేశంలో కోవిడ్‌కు సంబంధించి ఇంత భారీ స్థాయిలో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టడం కూడా ఇదే మొదటిసారి.



ఫార్మారంగ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న కోవ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఫేజ్‌ వన్‌… టు.. ట్రయల్స్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో దశ ట్రయల్స్‌కు ఇటీవలే భారత్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతులు ఇచ్చింది. తొలి రెండు దశల్లో వెయ్యి మందికిపైగా ఈ ట్రయల్స్‌ జరుగగా… ఇప్పుడు ఏకంగా… 26వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.



తొలిదశ వ్యాక్సిన్‌ సేఫ్టీని, రెండో దశలో ఇమ్యూనోజెనిసిటీకి సంబంధించిన విషయాలను పరీక్షించారు. ఇక మూడో దశలో వ్యాక్సిన్‌ పూర్తి సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఐసీఎంఆర్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలతో కలిసి భారత్‌ బయోటెక్‌ ఈ ప్రయోగాలను చేస్తోంది. ఇప్పటికే వాలంటీర్లు స్వచ్చందంగా క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ముందుకువచ్చిన నేపథ్యంలో… దేశవ్యాప్తంగా ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి.
https://10tv.in/vaccine-will-not-be-enough-to-stop-pandemic-who-chief/



భువనేశ్వర్‌, ఢిల్లీ, ముంబై, భూపాల్‌లో రెండేసిచోట్ల, అహ్మదాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌,తెలంగాణ, రోహ్‌తగ్‌, గోవా, గౌహతి, ఫరీదాబాద్‌, నాగ్‌పూర్‌, పాట్నా, పాండిచ్చేరి, బెంగలూరు, కోల్‌కతా, చెన్నైలో ఒక్కో ఆస్పత్రిలో ట్రయల్స్‌ను ప్రారంభించారు. తెలంగాణలో నిమ్స్‌లో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఏపీలో గుంటూరు మెడికల్‌ కాలేజ్‌, విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో ట్రయల్స్‌ ప్రారంభం కావాల్సి ఉంది. మూడోదశకు సంబంధించిన అనుమతులు ఇంకా రాలేదు. అవి రాగానే ట్రయల్స్‌ ప్రారంభించే అవకాశముంది.



క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారిని రెండు గ్రూప్ లుగా విభజించి ఇంట్రా మస్క్యూలర్ ఇంజెక్షన్లు ఇవ్వనున్నారు. మొత్తం 26వేల మందిలో 13వేలమందికి ఆరు గ్రాముల మైక్రో కోవ్యాక్సిన్ ఇంజెక్షన్లు రెండు లేక ప్లాసిబో రెండు డోసులను ఇవ్వనున్నారు. వాలంటీర్స్‌ హెల్త కండీషన్స్‌, వారిపై కరోనా ప్రభావాన్ని ఏడాది పాటు పరిశీలించనున్నారు. అయితే ఎవరికి ఏ రకం ఇంజెక్షన్ ఇచ్చారన్నది మాత్రం ట్రయల్స్ నిర్వాహకులకు, పాల్గొంటున్న వారికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహిస్తున్న మొట్టమొదటి సంస్థగా భారత్ బయోటెక్ నిలిచింది. ఫేజ్ త్రీ ట్రయల్స్ లో కూడా అనుకున్న ఫలితాలను సాధిస్తే భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేసేందుకు మార్గం సుగమమైనట్టే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.