నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు.. డీజీపీ ఉత్తర్వులు

నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు.. డీజీపీ ఉత్తర్వులు

Bihar Police Says No Jobs For Protesters: నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా అందులో పాల్గొన్నా ఇకపై వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. వారికి సర్కారీ కొలువులు రావు. అంతేకాదు ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కవు. ఈ మేరకు యువతను హెచ్చరిస్తూ బీహార్ పోలీసులు ఉత్తర్వులు విడుదల చేశారు. బీహార్‌ డీజీపీ ఎస్‌కే సింఘాల్‌ పేరిట సర్కులర్ జారీ చేశారు.

హింసాత్మక నిరసనలకు దిగడం, ధర్నాలు చేయడం, వివాదాస్పద సంఘటనల్లో పాల్గొనడం లాంటి చర్యలకు పాల్పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వారికి ఎలాంటి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవనీ ఈ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ఒకవేళ నిరసనల్లో హింస జరిగితే అందున్న పాల్గొన్న వారి సర్టిఫికెట్లల్లో రిమార్క్‌ రాస్తారని డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ ఉత్తర్వులు సంచలనం రేపుతున్నాయి. అలాగే వివాదానికి దారితీశాయి.

ఇటీవల బీహార్ టీచర్స్ ఎల్జిబులిటీ టెస్ట్, సెంట్రల్ టెట్ పాస్ అయిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. టీచర్ల సెలక్షన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, అర్హత సాధించిన అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. ఇది జరిగిన కొన్ని రోజులకే డీజీపీ ఈ సర్కులర్ జారీ చేయడం చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 94వేల ప్రైమరీ టీచర్ల పోస్టుల భర్తీకి బీహార్ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కోర్టు కేసు కారణంగా ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని బీహార్‌ పోలీసులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆ వివాదం సద్దుమణగక ముందే బీహార్ పోలీసులు మరో కాంట్రవర్సీకి తెరలేపారు.

తాజా సర్కులర్ పైనా తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. సీఎం నితీష్ కుమార్.. ముస్సోలిని, హిట్లర్ ని మించిపోయారని అన్నారు. అధికారంలో ఉన్న వారిపై నిరసన తెలపడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, ఉద్యోగాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది, అందుకే ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని యాదవ్ మండిపడ్డారు.