West Bengal : మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంక..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానిపుర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈమెకు పోటీగా ప్రియాంక తిబ్రేవ‌ల్ పోటీగా ఉంచేందుకు బీజేపీ సిద్దమైనట్లు సమాచారం.

West Bengal : మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంక..!

West Bengal

West Bengal : ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే.. ఈ ఎన్నికల్లో త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మూడవసారి అధికారం చేపట్టింది. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఓటమి చవిచూశారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈమె.. సువెందు అధికారిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే మరోస్థానం నుంచి పోటీ చేసేందుకు మమత సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ స్థానాల్లో భవానిపూర్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచే మమత పోటీ చేయనున్నారు.

మరోసారి మమతను ఓడించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది, ఈ సమయంలోనే బలమైన అభ్యర్థికోసం పార్టీ నేతలు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ ప్రియాంక తిబ్రేవ‌ల్ పేరు తెరపైకి వస్తోంది. వృత్తి రీత్యా న్యాయవాది. బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఈమెకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో బాబుల్ సుప్రియోల్ లీగర్ అడ్వైజర్ గా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరిన ప్రియాంక. 2015 కోల్ కతా మున్సిపల్ ఎన్నికల్లో 58 వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.

ఆరేళ్లుగా బీజేపీలో ఉంటున్న ఆమె పార్టీలో కీల‌క హోదాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం బెంగాల్ బీజేవైఎం ఉపాధ్య‌క్షురాలిగా పనిచేస్తున్నారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె ఎంట‌ల్లి నుంచి పోటీ చేసి టీఎంసీ నేత స్వ‌ర్ణ‌క‌మ‌ల్ సాహా చేతిలో ఓడిపోయారు. బీజేపీలో బలమైన మహిళా నేతగా ఉండటంతో ఈమెకే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం మొత్తం ఆరుగురి పేర్లను పరిశీలనలో ఉంచింది బీజేపీ.

మరోవైపు మమతపై కాంగ్రెస్ భావానిపుర్ లో పోటీకి వెనుకంజ వేస్తోన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మమతకు తమ మద్దతు తెలిపేలా కనిపిస్తోంది. ఇక ఈ స్థానం నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ క‌చ్చితంగా గెల‌వాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 164 ఆర్టిక‌ల్ ప్ర‌కారం.. మంత్రిగా ఉన్న వ్య‌క్తి.. ఆర్నెళ్ల‌లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుంటే, అప్పుడు ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ బైపోల్ దీదీకి కీల‌కం కానున్న‌ది.

సెప్టెంబర్ 30 తేదీన ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడుతాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలిస్తేనే మమత సీఎంగా కొనసాగుతారు. లేదంటే ఆమె నవంబర్ చివరి నాటికి పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది.