50-50 ఫార్ములా : మహారాష్ట్రలో బీజేపీ – శివసేన సర్కార్

  • Published By: madhu ,Published On : October 25, 2019 / 12:39 AM IST
50-50 ఫార్ములా : మహారాష్ట్రలో బీజేపీ – శివసేన సర్కార్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. అయితే సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికి వరకు బీజేపీకి వెన్నంటే ఉన్న శివసేన.. ఈ సారి సీఎం కుర్చీని పంచుకోవాలని ఆశిస్తోంది. మరి ఇందుకు బీజేపీ ఒప్పుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో.. శివసేనకు హ్యాపీ.. బీజేపీకి బీపీ అన్నట్లు తయారైంది.

ముఖ్యమంత్రి పీఠాన్ని పంచాల్సిందేనని శివసేన డిమాండ్ చేస్తోంది. ఈసారి ముఖ్యమంత్రి పదవిని ఇరు పార్టీలూ పంచుకోవాల్సిందేనని శివసేన స్పష్టం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాకరే కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 50-50 ఫార్ములా అమలు చేయాల్సిందేనని అన్నారు. ఈ ఒప్పందాన్ని ఎన్నికలకు ముందు అమిత్‌షాతో కుదుర్చుకున్నామని వెల్లడించారు. అయితే, ముందు ఎవరు సీఎం కావాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉందని అన్నారు. 

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా.. బీజేపీ, శివసేన కూటమి 161 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి 98 చోట్ల గెలిచింది. ఎంఐఎం 2 చోట్ల, ఇతరులు 27చోట్ల విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు ఎన్డీఏ కూటమి క్వీన్ స్వీప్ చేయలేక పోయింది. ఎన్నికల ఫలితల వెల్లడి ముందు వరకు తామే సొంతగా అధికారంలోకి వస్తామని  బీజేపీ అంచనా వేసింది. కానీ ఆ పార్టీ కేవలం 105 స్థానాలకే పరిమితమైంది. శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. 

శివసేన నుంచి ముఖ్యమంత్రి రేసులో ఆదిత్య ఠాక్రే ముందు వరుసలో ఉన్నారు. మహారాష్ట్రలోని వర్లీ నియోజకవర్గం నుంచి శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే విజయం సాధించారు. ప్రత్యర్థి అయిన ఎన్సీపీ అభ్యర్థి సురేశ్‌ మానేపై 70 వేల భారీ మెజారిటీతో ఈయన గెలుపొందారు. ఆదిత్య ఠాక్రే విజయం ఖాయమని ముందు నుంచి బలమైన అంచనాలున్నా ఠాక్రే కుటుంబంలోని వ్యక్తి ఎన్నికల్లో మొదటిసారి ప్రత్యక్షంగా పోటీ చేసి విజయం సాధించారు. మొత్తానికి ముఖ్యమంత్రి పీఠాన్ని పంచాల్సిందేనన్న శివసేన ప్రతిపాదనకు బీజేపీ ఏ ఏమేరకు అంగీకరిస్తుందో చూడాలి. ఒకవేళ అంగీకరిస్తే.. అరవై ఏళ్ల ఘన చరిత్ర కలిగిన మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని పార్టీలు పంచుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. 
Read More : రెండో సారి గెలవడం గొప్పే: మోడీ