11రోజుల తర్వాత MiG-29 పైలట్ మృతదేహం లభ్యం

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2020 / 05:21 PM IST
11రోజుల తర్వాత MiG-29 పైలట్ మృతదేహం లభ్యం

Body of missing MiG-29 pilot found 11 రోజుల క్రితం అదృశ్యమైన మిగ్-29 పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహం లభ్యమైనట్లు సోమవారం(డిసెంబర్-7,2020)నేవీ అధికారులు తెలిపారు. నవంబర్-26న MIG-29K శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. దేశీయ ఏకైక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ “INS విక్రమాదిత్య”డెక్ పై నుంచి టెకాఫ్ అయిన రెండు సీట్ల రష్యన్ తయారీ MIG-29K ట్రైనర్ జెట్ అరేబియా సముద్రంలో కూలిపోయింది.



ఈ ఘటనలో ఒక పైలట్‌ ను రెస్క్యూ టీమ్ కాపాడగలిగింది. అయితే మరో పైలట్‌ అయిన నిశాంత్‌ సింగ్‌ జాడ తెలియలేదు. దీంతో ఆ రోజు నుంచి అతడి కోసం అరేబియా సముద్రంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు 11 రోజుల తర్వాత సోమవారం నిశాంత్‌ సింగ్‌ అవశేషాలను కనుగొన్నట్లు నేవీ అధికారులు ప్రకటించారు.



గోవా తీరానికి 30 మైళ్ల దూరంలోని సముద్రం నీటి లోపల, 70 అడుగుల మీటర్ల లోతులోని సముద్రగర్భం వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించి వెలికి తీసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం నిశాంత్‌ సింగ్‌ మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కుటుంబానికి అప్పగిస్తామని నేవీ అధికారులు తెలిపారు.