చంద్రయాన్ 2 : మూన్ ల్యాండింగ్ లో ఆ 15 నిమిషాలే కీలకం

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 09:44 AM IST
చంద్రయాన్ 2 : మూన్ ల్యాండింగ్ లో ఆ 15 నిమిషాలే కీలకం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్‌ -2 ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ల్యాండర్‌ విక్రమ్‌.. చంద్రుడిపై పాదం మోపడానికి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. అర్ధరాత్రి దాటిన తరువాత అంటే సెప్టెంబర్ 07వ తేదీ శనివారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య.. ల్యాండర్‌లోని ఇంజిన్‌ను మండించి చంద్రుడి ఉపరితలంవైపు మళ్లిస్తారు.

అరగంట ప్రయాణం అనంతరం అంటే అర్థరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర మధ్య ల్యాండర్‌ ఉపరితలంపై సున్నితంగా దిగనుంది. అనంతరం పరిశోధనలు చేయడం ప్రారంభించనుంది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగేందుకు అన్ని ఏర్పాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. విక్రమ్‌ కచ్చితంగా ఉపరితలంపై దిగుతుందని, దీంతో మన దేశం… రష్యా, అమెరికా, చైనా సరసన నిలుస్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

విక్రమ్‌ ల్యాండర్‌ను శనివారం తెల్లవారుజామున ఒంటిగంట 55 నిమిషాలకు జాబిల్లిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత.. ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్య పరిశోధనలు ప్రారంభిస్తుంది. విక్రమ్‌ ల్యాండర్‌లో నుంచి 27 కిలోల బరువుతో 6 చక్రాలు కలిగి ఉండే ప్రజ్ఞాన్‌ రోవర్‌ వెలుపలికి వచ్చి పరిశోధనలు చేస్తుంది. ఆ సమయంలో అది విక్రమ్‌ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్‌కు చేరవేస్తుంది.

విక్రమ్‌ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌కు అందుతుంది. మూన్ ల్యాండింగ్ లో ఆ 15 నిమిషాలు చాలా చాలా కీలకం అంటున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. సెకన్ కు 3 అడుగులు కిందకు దిగనుంది. ఈ లెక్కన చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ టచ్ కావటానికి 15 నిమిషాలు పట్టనుంది. ఈ టైం మాకు చెమటలు పట్టే సమయం అని.. మొత్తం ప్రాజెక్ట్ లో ఎంతో కీలకం అని ప్రకటించింది ఇస్త్రో.

చంద్రుడికి 35 x 100 కిలోమీటర్ల కక్ష్యలో ఉన్న ఈ క్రాఫ్ట్ ..అత్యంత వేగంతో తిరుగుతోంది. వేగం ప్రస్తుతం గంటకు 6 వేల కిలోమీటర్లుగా ఉంది. అంతటి వేగాన్ని కేవలం 15 నిమిషాల్లోనే క్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది. 7.4 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో 526 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోతుంది. చంద్రుడిపై నెమ్మదిగా దిగుతుంది. ఇదే చంద్రయాన్ – 2లో అతి కీలకఘట్టంగా పేర్కొంటున్నారు శ్రాస్తవేత్తలు. 

Read More : సింధు నాగరికతపై మరో ఆసక్తికర విషయం
ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో కష్టతరంగా నిర్వహిస్తున్న విక్రమ్‌ ల్యాండింగ్‌ను ప్రధాని మోదీ తిలకించనున్నారు. బెంగళూరులోని మిషన్‌ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఆయన తిలకిస్తారు. విద్యార్థులతో కలిసి చంద్రయాన్‌ 2 విక్రమ ల్యాండింగ్‌ను ప్రధాని వీక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్రానికి ఇద్దరి చొప్పున విద్యార్థులను ఇస్రో ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ఇస్రో పోటీలు నిర్వహించి వారిని ఎంపిక చేసింది.