Charanjit Singh Channi : పంజాబ్ సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రమాణం

పంజాబ్‌ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో చన్నీతో గవర్నర్‌ భన్వర్ లాల్ పురోహిత్‌ ప్రమాణం స్వీకారం చేయించారు.

Charanjit Singh Channi : పంజాబ్ సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రమాణం

Charanjit Singh

Punjab CM Charanjit Singh Channi : పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం స్వీకారం చేయించారు. ఆయన తర్వాత కాంగ్రెస్‌ నేతలు సుఖిందర్‌ ఎస్‌ రంధ్వానా, ఓపీ సోని ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పంజాబ్‌ వ్యవహారాల బాధ్యుడు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ నవజోత్ సింగ్‌ సిద్ధూ హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు చరణ్‌జిత్‌ చన్నీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ను కలిసి అక్కడి నుంచి రాజ్‌భవన్‌ చేరుకున్నారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి దళిత నేత చన్నీనే కావడం విశేషం. గతవారం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామాతో పంజాబ్‌ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. కెప్టెన్‌ స్థానంలో ఎవరికి అవకాశం కల్పించాలనే విషయంలో కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడింది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన స్థానంలో చరణ్‌జిత్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎంపిక చేసింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత చివరకు చన్నీని ఎంపిక చేసింది. మొన్నటి వరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న 58 ఏళ్ల చన్నీ.. అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

Punjab CM : పంజాబ్ సీఎంగా ఎన్నికైన చరణ్​జీత్ సింగ్ చన్నీ

ఇక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ పార్టీ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు కల్పించింది. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన చన్నీ.. సిద్ధూకు అత్యంత సన్నిహితుడు. చామ్‌కౌర్‌సాహిబ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా మూడుసార్లు, మున్సిపల్‌ ఛైర్మన్‌గా రెండుసార్లు గెలిచారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మోడీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చన్నీ ఈ మధ్యాహ్నం మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. చన్నీని కెప్టెన్‌ భోజనానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మాజీ సీఎం ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.