కాంగ్రెస్ విశ్వాసఘాతుకానికి పాల్పడింది…మాయావతి

  • Published By: venkaiahnaidu ,Published On : September 17, 2019 / 12:15 PM IST
కాంగ్రెస్ విశ్వాసఘాతుకానికి పాల్పడింది…మాయావతి

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో తమ రాజస్థాన్‌‌లో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు  కాంగ్రెస్‌ లో చేరడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదని, విశ్వాసఘాతుకానికి పాల్పడిందని వరుస ట్వీట్లలో నిప్పులు చెరిగారు. 

బీఎస్పీ ఎమ్మెల్యేలను ప్రలోభపరచడం ద్వారా కాంగ్రెస్ ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదని నిరూపించుకుంది. రాజస్థాన్‌లో తాము కాంగ్రెస్ పార్టీకి బేషరుతుగా మద్దతు ఇస్తే ఆ పార్టీ మాత్రం విశ్వాసఘాతుకానికి పాల్పడిందని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రత్యర్థులతో సమర్ధవంతంగా పోరాడటానికి బదులు తమకు మద్దతిచ్చిన పార్టీలను నష్టపరుస్తూనే ఉందని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్ దళిత, ఎస్టీ, ఓబీసీల వ్యతిరేకి కావడమే ఇందుకు కారణమని మాయావతి అన్నారు. 

సోమవారం(సెప్టెంబర్-16,2019) సాయంత్రం రాజస్థాన్‌ లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. లకన్ సింగ్ మీనా,సందీప్ యాదవ్,దీప్ చంద్ ఖైరా,రాజేంద్ర గుడా,జోగిందర్ సింగ్,వాజిబ్ అలి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సొంత నియోజకవర్గాల అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నామని బీఎస్పీ ఎమ్మెల్యే జోగిందర్ సింగ్ తెలిపారు. బీఎస్‌పీ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్టు ఒక లేఖను స్పీకర్ సీపీ జోషికి లాంఛనంగా అందజేశామన్నారు.