డ్రాగన్ దుస్సాహ‌సం : అరుణాచల్ ప్రదేశ్ లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా

డ్రాగన్ దుస్సాహ‌సం : అరుణాచల్ ప్రదేశ్ లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా

China చైనా మ‌రో దుస్సాహ‌సానికి పాల్ప‌డింది. ఈసారి ఏకంగా భార‌త భూభాగంలోకి 4.5 కిలోమీట‌ర్ల మేర చొచ్చుకొని వ‌చ్చి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించేసింది. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాయి. గ‌తేడాది నవంబ‌ర-1,2020న శాటిలైట్ ఈ ఫొటోల‌ను తీసింది. చైనా నిర్మించిన గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు తెలియజేస్తున్నాయి

అరుణాచ‌ల్‌లోని సుబాన్‌సిరి జిల్లాలో తారి చు న‌ది ఒడ్డున చైనా ఈ గ్రామాన్ని నిర్మించింది. అయితే, చాలా కాలంగా ఈ ప్రాంతం చాలా కాలంగా రెండు దేశాల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మ‌వుతోన్న విషయం తెలిసిందే. అటువంటి చోట చైనా ఏడాది వ్యవధిలో ఓ ఊరినే నిర్మించింది. అయితే, ఇదే ప్రాంతంలో ఆగ‌స్ట్ 26-2019న తీసిన మ‌రో ఫొటోలో ఎలాంటి నిర్మాణాలు క‌నిపించ‌డం లేదు. అంటే ఏడాదిలోపే చైనా ఇక్కడ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు అర్థమవుతోంది. ఈ ఫొటోలను ప్ర‌ముఖ చానెల్ ఎన్డీటీవీ బ‌య‌ట‌పెట్టింది.

నిజానికి గ‌తేడాది న‌వంబ‌ర్‌లోనే చైనా చొర‌బాట్ల గురించి అరుణాచ‌ల్ బీజేపీ ఎంపీ త‌పిర్ గావో లోక్‌స‌భ దృష్టికి తీసుకొచ్చారు. సుభాన్‌సిరి జిల్లాలోనే చైనా చొర‌బాట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కూడా ఆయన హెచ్చరించారు. న‌ది వెంబ‌డి డ‌బుల్ లేన్ రోడ్డును చైనా నిర్మిస్తోంద‌ని, సుమారు 60-70 కిలోమీట‌ర్ల మేర భార‌త భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చింద‌ని కూడా ఆయ‌న చెప్పారు.

అయితే తాజాగా బయటికొచ్చిన ఫొటోల్లో ఉన్న‌ది ఏంట‌నేదానిపై విదేశాంగ శాఖ స్ప‌ష్టంగా స‌మాధాన‌మివ్వ‌లేదు. కానీ ఇండియా స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనా నిర్మాణాలు చేప‌డుతున్న‌ద‌న్న విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, త‌మ ప్ర‌భుత్వం కూడా స‌రిహ‌ద్దు వెంబ‌డి రోడ్లు, బ్రిడ్జ్‌ల వంటి మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌రుస్తున్నామ‌ని మాత్రమే చెప్పింది.