Bodies Identification : రావత్ దంపతులు,మరొకరు తప్ప..గుర్తించలేని స్థితిలో 10 మృతదేహాలు!

తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నాం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే

Bodies Identification : రావత్ దంపతులు,మరొకరు తప్ప..గుర్తించలేని స్థితిలో 10 మృతదేహాలు!

Art8

Army Choper Crash : తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నాం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ప్రమాద తీవ్రత కారణంగా ఆ మృతదేహాలను గుర్తించడం ఆర్మీకి సవాల్ గా మారింది.

బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, రావత్‌ రక్షణ సలహాదారుడు బ్రిగేడియర్ ఎల్‌ఎస్‌ లిడ్డర్‌ మృతదేహాలు మాత్రమే గుర్తించేలా ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్ కూలిన ఘటన తీవ్రత వల్ల అందులో ప్రయాణించిన మిగతా పది మంది సిబ్బంది మృతదేహాలను గుర్తించడం చాలా కష్టంగా ఉన్నదని పేర్కొంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల సున్నితత్వం, భావోద్వేగ్వాన్ని పరిగణనలోకి తీసుకొని మృతదేహాల సానుకూల గుర్తింపు కోసం సాధ్యమయ్యే అన్ని చర్యలు తీసుకుంటామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ఇందుకోసం బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులను ఢిల్లీకి రప్పించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల గుర్తింపులో వారికి అవసరమైన సహాయం, మద్దతు ఇస్తామని తెలిపారు. డీఎన్​ఏ టెస్టింగ్​తో అదనంగా.. కుటుంబ సభ్యులు గుర్తించిన వివరాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించారు. అప్పటివరకు వారి భౌతికకాయాలను ఢిల్లీలోని ఆర్మీ బేస్ హాస్పిటల్ మార్చురీలో ఉంచనున్నట్లు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే.. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సైనిక లాంఛనాలతో అప్పగించనున్నట్లు వెల్లడించారు.

అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆయా కుటుంబాలతో సంప్రదించిన అనంతరం మరణించిన సిబ్బంది మృతదేహాలకు తగిన సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా,హెలికాప్టర్​ క్రాష్​లో మరణించిన వారి పార్థీవదేహాలు గురువారం రాత్రి 7:40గంటలకు ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ కు చేరుకోనున్నట్లు సమాచారం. 8:30గంటల నుంచి శ్రద్ధాంజలి కార్యక్రమం ఉండనుందని సమాచారం.

ALSO READ Army Chopper Crash : బిపిన్ రావత్ నీళ్లు కావాలని అడిగారు..కన్నీటి పర్యంతమైన ప్రత్యక్ష సాక్షి