ట్రాక్టర్ నడుపుకుంటూ..అసెంబ్లీకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే, ఎందుకు ?

ట్రాక్టర్ నడుపుకుంటూ..అసెంబ్లీకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే, ఎందుకు ?

Rajasthan Assembly on a tractor : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ…కేంద్రం మాత్రం..చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగినా..ప్రతిష్టంభన నెలకొంది. వీరు చేస్తున్న పోరాటానికి పలువురు మద్దతు తెలియచేస్తున్నారు.

తాజాగా..రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందిరా మీనా..వినూత్న రీతిలో నిరసన తెలియచేశారు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న పోరాటానికి ఆమె మద్దతు తెలియచేశారు. రైతులకు సంఘీభావంగా..ఆమె స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ..అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం విశేషం. తమ హక్కుల కోసం రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియచేస్తూ..తాను ఈ విధంగా చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. రెండు నెలలకు పైగా..వారు ఎన్నో కష్టాలు పడుతూ..ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్నారని ఎమ్మెల్యే ఇందిరా మీనా వెల్లడించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ..అసెంబ్లీకి వెళ్లుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మరోవైపు…పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూని న్యాయస్థానం పోలీస్‌ కస్టడీకి పంపిస్తూ ఆదేశించింది. రిపబ్లిక్‌ డే రోజున ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల పరేడ్‌ సందర్భంగా చారిత్రక ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు దీప్‌సిద్ధూను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో ఆయనే హింసకు ప్రేరేపించినట్టు పోలీసులు తెలిపారు. 10 రోజుల పాటు రిమాండ్‌ కోరిన పోలీసులు.. రైతులు ట్రాక్టర్లతో బారికేడ్లను ధ్వంసం చేసేలా రెచ్చగొట్టడంతో పాటు అనుమతించిన రూట్‌నుంచి వారిని దీప్‌సిద్ధూ తప్పుదారి పట్టించినట్టు వివరించారు.