Gujarat : డాక్టర్ల నిర్లక్ష్యం, రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని ఆదేశం

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ రోగి చనిపోయింది. దీంతో రోగి కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయటంతో రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

Gujarat : డాక్టర్ల నిర్లక్ష్యం, రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని ఆదేశం

Gujarat doctors told to pay Rs 33 lakh for patient death

Gujarat : డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ రోగి చనిపోయింది.కడుపు నొప్పితో బాధపడుతు వచ్చిన రోగికి సర్జరీ చేసిన డాక్టర్లు ఆమె ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. దీంతో రోగి బంధువులు తమకు న్యాయం చేయాలని పరిహారం ఇప్పించాలని కోరుతూ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించగా రోగి కుటుంబానికి రూ.33.70 లక్షలు పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఆదేశించిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

జోష్నాబెన్ పటేల్ అనే మహిళ కడుపులో నొప్పితో బాధపడుతూ జామ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షలు చేసిన డాక్టర్లు కడుపులో ట్యూమర్ ఉందని గుర్తించారు. సర్జరీ చేసి తొలగించాలని చెప్పారు.దీంతో సదరు మహిళ భర్త, కుటుంబ సభ్యులు సర్జరీకి అంగీకరించారు. దీంతో ఆమె కడుపులోని ట్యూమర్ తొలగించేందుకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉందని సూచించారు. దీనికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించటంతో 2015 జూన్ 1న జామ్ నగర్ లోని కల్పనాభట్ హాస్పిటల్ లో సర్జరీ చేశారు.

సర్జరీ తర్వాత జోష్నాబెన్ పటేల్ ఆరోగ్యం విషమించటంతో ఆమెను ఐసీయూకి తరలించి చికిత్సనందించారు. కానీ ఆరోగ్యం మరింతగా విషమించింది. దీంతో ఆమెను ఆ హాస్పిటల్ నుంచి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో వేరే ఆసుపత్రికి ఆమెను తరలించారు. కానీ ఆరోగ్యంలో ఎటువంటి నిలకడ రాలేదు. అలా పరిస్థితి విషమించి చివరికి ఆమె చనిపోయింది. దీంతో ఆమె భర్త పరేష్ పటేల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నా భార్య చనిపోయిందని తనకు న్యాయం చేయాలని కోరుతూ..సర్జరీ చేసిన డాక్టర్ దీపేన్ షా,మత్తు డాక్టర్ రాకేస్ దోషీలపై వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.

విచారణ తరువాత కమిషన్ కు అందిన రిపోర్టులో సదరు మహిళా రోగి లాప్రోస్కోపీకి సంబంధించి పొట్ట భాగంలో మూడు రంధ్రాలతోపాటు, 14 సెంటీమీటర్ల కోత కూడా ఉన్నట్టు పోస్ట్ మార్టమ్ నివేదిక వెల్లడించింది. ఆసుపత్రి డిశ్చార్జ్ సమ్మరీలో మత్తు మందు వల్ల షాక్ కు గురైనట్టు ఉంది. దీంతో సర్జన్, ఫిజీషియన్, అనస్థీషియా వైద్యులకు వ్యతిరేకంగా జోష్నాబెన్ పటేల్ భర్త పరేష్ పటేల్ వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన భార్య ప్రాణాలు కోల్పోయినందున, పరిహారం ఇప్పించాలని కోరారు.

లాప్రోస్కోపిక్ సర్జరీ సమయంలో కార్బన్ డయాక్సైడ్ ఎంబోలిజం తలెత్తడం వల్ల జోష్నాబెన్ పటేల్ మరణించినట్టు కమిషన్ గుర్తించింది. చికిత్స సమయంలోడాక్టర్లు నిర్లక్ష్యం వహించారని భావించిన కమిషన్ దీనికి సర్జన్ తో పాటు మత్తుమందు డాక్టర్ కూడా బాధ్యత వహించాలని స్పష్టంచేసింది. ఈ కేసులో ఫీజిషియన్ తప్పిదం లేదని భావించింది.

రోగి వయసు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.33.70 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని తాజాగా ఆదేశించింది. ఈ మొత్తాన్ని సర్జీరీ జరిగిన 2015 నుంచి 10 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా సర్జన్, అనస్థీషియా డాక్టర్ చెల్లించాలని తీర్పు చెప్పింది. న్యాయ ఖర్చుల కింద మరో రూ.25వేలు కూడా చెల్లించాలని కూడా ఆదేశించింది.