దేశంలో తీవ్రస్థాయికి కరోనా.. సామాన్యులను తాకింది.. SBI ఆందోళన

  • Published By: vamsi ,Published On : August 20, 2020 / 07:00 AM IST
దేశంలో తీవ్రస్థాయికి కరోనా.. సామాన్యులను తాకింది.. SBI ఆందోళన

భారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కరోనా కేసుల ధోరణి పరిశీలిస్తే ప్రపంచంలో 75 శాతం రికవరీ రేటు కనిపిస్తుంది. భారతదేశంలో రికవరీ రేటు 73 శాతానికి చేరుకుంది. ఈ రికవరీ రేటును దాటిన ఐదు రాష్ట్రాలు ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ మరియు త్రిపుర. ఈ ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు శిఖరాలను దాటాయి, అయితే 22 రాష్ట్రాలలో ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదు.



SBI-ECORAP నివేదిక ఆర్థిక వ్యవస్థ నుంచి కరోనాలోని పోకడలను మరియు సామాన్యులపై చూపే ప్రభావాన్ని వివరంగా విశ్లేషించింది. అయితే కరోనా శిఖరంలో 75% రికవరీ రేటుకు ఖచ్చితమైన ప్రమాణం లేదని నివేదిక పేర్కొంది. బ్రెజిల్‌లో ఇది 69 శాతానికి చేరుకోగా.. మలేషియాలో 79.5 శాతం, ఇరాన్‌లో 77.6 శాతం, బహ్రెయిన్‌లో 77.1 శాతం, చైనాలో 77 శాతం, చిలీలో 70.4 శాతం రికవరీ రేటుకు చేరుకుంది. ఈ క్రమంలో రికవరీ రేటు 73 శాతంతో, భారతదేశం గరిష్ట స్థాయికి చేరుకుంది. రాబోయే రెండు, మూడు వారాల్లో భారత్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో 10 లక్షల జనాభాకు తక్కువ పరీక్షలు నిర్వహించడంపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నివేదిక ప్రకారం, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో కరోనా కేసుల రెట్టింపు రేటు చాలా ఎక్కువ. ఇక్కడ 22 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అవుతుండగా, ప్రపంచంలో కేసులు రెట్టింపు అవడానికి సగటున 43 రోజులు పడుతోంది. సహజంగానే, ఇది కూడా ఆందోళనకు ప్రధాన కారణం.



ఇది సామాన్యులను లోతుగా తాకడం ఆందోళన కలిగించే విషయం. కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాల స్తబ్దత కారణంగా సామాన్యుల ఆదాయం తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఎస్బిఐ ప్రకారం, ఈ సంవత్సరం సగటు తలసరి ఆదాయం 27 వేల రూపాయలు తగ్గుతుంది. తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, గోవా వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సగటు తలసరి ఆదాయం 40 వేల రూపాయలు తగ్గుతుంది.

SBI ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకుండా లాక్‌డౌన్ విధించడం మరియు తొలగించడం ద్వారా సాధారణ జీవన మార్గాలను పరిమితం చేస్తూ ఉంటే, ఇది 0.55 శాతం నుండి 3.5 శాతం వరకు మరణాలకు దారితీయవచ్చు, ఇది కరోనా వలన మరణాలకు అదనంగా ఉంటుంది, కానీ నివేదికలో ఈ అదనపు మరణాలు ఏ రూపంలో వస్తాయో స్పష్టంగా నివేధిక చెప్పలేదు. కరోనా కారణంగా ప్రజలు ఆకలితో మరణించడం లేదా మరే ఇతర కారణాల గురించి ప్రస్తావించలేదు.