ఢిల్లీ రైతు ఆందోళనలో భర్తలు..వ్యవసాయం చేస్తున్న భార్యలు

ఢిల్లీ రైతు ఆందోళనలో భర్తలు..వ్యవసాయం చేస్తున్న భార్యలు

Delhi : Husbands in Delhi farmers’ protests..wifes farming : ప్రతీ మగాడి వెనుక ఓ మహిళ ఉంటుందని పెద్దలు ఊరికనే అనలేదు. భర్త దేశం కోసం ప్రాణాలు పణ్ణం పెట్టి పోరాడుతున్నా..భార్య భయపడదు. నువ్వు దేశం కోసం పోరాడు..నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటానని భర్త వెన్ను తట్టి పోరాటానికి పంపే భార్యలున్నదేశం మనదేశం. చరిత్రను తిరగేస్తే ఇటువంటి థీర వనితల గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు.

అలాగే వ్యవసాయం చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతుల హక్కుల కోసం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భర్తలు పోరాడుతుంటే వారి భార్యలు మాత్రం వ్యవసాయం చేస్తున్నారు.
భర్తలు ఢిల్లీ పొలిమేరల్లో ఆందోళనలకు తరలిపోగా వారి భార్యలు సొంత గ్రామాల్లో వ్యవసాయ పనుల బాధ్యత తలకెత్తుకున్నారు. అంతేకాదు.. పొలం పన్లు, ఇంటి పనులు చూసుకున్నాక ప్రతీరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా తమ ఊళ్లోనే భర్త పోరాటానికి మద్దతునిస్తూ ధర్నాలు చేస్తున్నారు.

పంజాబ్‌, హరియాణాల్లో ఇటువంటి భార్యలు ఎంతోమంది తమ భర్తలను ప్రోత్సహిస్తున్నారు. రైతుల కోసం చేసే ‘ఈ పోరాటం ఆగకూడదు. మా మగవారిని ఢిల్లీలోనే ఉండి పోరాడమని చెప్పాం. వారికి కావాల్సినవన్నీ మేం పంపుతున్నాం. ఇంటి బాధ్యతలతో పాటు వ్యవసాయం బాధ్యతలను కూడా మేమే చూసుకుంటున్నాం.

అంతేకాదు మా మగవారిని ప్రోత్సహిస్తు వారి చేసే పోరాటానికి మీ వెనుక మేమున్నాం అని చెప్పటానికి మేం కూడా మా గ్రామాల్లో ధర్నాలు చేస్తున్నాం’ అని మోగా గ్రామానికి చెందిన కరమ్‌జీత్‌ కౌర్‌ అనే మహిళ తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం (డిసెంబర్ 14,2020) జరిపిన ధర్నాల్లో పంజాబ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రధానంగా మహిళలే పాల్గొనడం విశేషం.