సొంత హత్యకు సుపారీ.. విచారణలో బయటపడిన నిజం

  • Published By: vamsi ,Published On : June 16, 2020 / 12:35 AM IST
సొంత హత్యకు సుపారీ.. విచారణలో బయటపడిన నిజం

ఇష్టపడ్డ మరణం రానంటుంది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం నిద్ర పట్టనివ్వట్లేదు.. ఏం చెయ్యలో అర్థం కాలేదు.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే తనను తానే హత్య చేయించుకునేందుకు సుపారీ ఇచ్చాడు. మైనర్‌తో హత్య చేయించుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని రాన్హోలాలో 35 ఏళ్ల వ్యాపారవేత్త గౌరవ్ బన్సాల్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. 

అయితే హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. వ్యాపారి తన కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బు లభించేలా చెయ్యాలనే కారణంతో తన సొంత హత్యకు సుపారీ ఇచ్చినట్లు తేలింది. గౌరవ్ బన్సాల్.. ఫిబ్రవరిలో రూ.6 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుని డిప్రెషన్‌కు చికిత్స కోసం వినియోగించాడు. క్రెడిట్ కార్డు మోసాల్లో రూ.3.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఓ దశలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టగా.. తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో కుటుంబం బాగా బతుకుతుందని ఈ చర్యకు పాల్పడ్డాడు.

అనుకున్నదే తడవుగా ఓ మైనర్ బాలుడితో ఫోన్ ద్వారా డీల్ మాట్లాడుకుని సుపారీ ఇఛ్చాడు. తన ఫొటోను ఆ మైనర్‌కు పంపి.. ఫొటోలో ఉన్న వ్యక్తి ఫలానా ప్రదేశానికి వస్తాడని చెప్పి, అక్కడికి తానే వెళ్లాడు. ఆ కుర్రాడు మరో ముగ్గురి సాయంతో గౌరవ్ బన్సాల్‌ను చంపి చెట్టుకు వేలాడదీసి, హంతకులు చెప్పిన పనిని పూర్తి చేశారు. 

అయితే, తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య షాను బన్సాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌరవ్ ఫోన్ డేటాపై దృష్టి పెట్టారు. ఓ మైనర్ కుర్రాడితో ఎక్కువ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సొంత హత్యకు సుపారీ ఇచ్చిన వ్యవహారం బయటకు వచ్చింది.