ఇప్పుడే స్కూళ్లు తెరవొద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు, ప్రభుత్వానికి నిపుణుల సూచన

  • Published By: naveen ,Published On : July 5, 2020 / 03:42 PM IST
ఇప్పుడే స్కూళ్లు తెరవొద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు, ప్రభుత్వానికి నిపుణుల సూచన

దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం విద్యార్థులను, తల్లిదండ్రులను, నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పట్లో స్కూళ్లు తెరవొద్దని నిపుణులు ప్రభుత్వానికి సూచన చేశారు. స్కూల్స్ తెరవడం అంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే అవుతుందని హెచ్చరించారు. కనీసం జూలై నెలాఖరు వరకైనా ఆగి చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్టే:
రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ అంశంపై విద్యాశాఖ అధికారులు స్కూళ్ల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, తల్లిదండ్రులతో మాట్లాడారు. స్కూల్స్ రీఓపెన్ పై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జూలై నెలఖారు వరకు స్కూళ్లు తెరవకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. స్కూళ్లు రీఓపెన్ చేయడం ద్వారా లక్షల మంది విద్యార్థుల ప్రాణాలను రిస్క్ లో పడేసినట్టు అవుతుందని మెజార్టీ వ్యక్తులు చెప్పారు. సాధ్యమైనంత ఆలస్యంగా పాఠశాలలు తెరవడమే మంచిదన్నారు.

తొందరపడితే అనర్థమే:
హడావుడిగా స్కూళ్లు తెరిచినా, తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్స్ కి పంపడానికి ఇష్టపడరని నిపుణులు చెప్పారు. ముంబై లాంటి ప్రాంతంలో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట సోషల్ డిస్టేన్స్ మెయింటేన్ చేయడం కష్టం కాబట్టి, స్కూళ్లను ఆలస్యంగా తెరవడమే మంచిదని బీజేపీ నేతలు చెప్పారు. అందరి అభిప్రాయాల మేరకు పాఠశాలల పున:ప్రారంభంపై తొందరపడకూడని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గే వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడమే బెటర్ అని చెప్పింది.

2లక్షలు దాటిన కరోనా కేసులు:
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఇక్కడి నుంచే నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలు దాటింది. 8వేల 671మంది కరోనాతో చనిపోయారు.