బాధ్యత ఉండక్కర్లా?: కరోనా పేషెంట్‌పై సీఎం సీరియస్

  • Published By: vamsi ,Published On : March 18, 2020 / 05:40 PM IST
బాధ్యత ఉండక్కర్లా?: కరోనా పేషెంట్‌పై సీఎం సీరియస్

ఒక్క చిన్న తప్పు పెను ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఏ మాత్రం అలసత్వం వహించినా కూడా మానవాళిని కోల్పోయే పరిస్థితి. దేశంలో కూడా కరోనా వైరస్ రాకతో పరిస్థితులు మారిపోయాయి. అయినా కూడా కొందరు ప్రవర్తించే తీరు ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తుంది. లేటెస్ట్‌గా పశ్చిమ బెంగాల్‌లో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది.

కోల్‌కతాకు చెందిన ఐఏఎస్ అధికారి కుమారిడికి వైరస్ సోకినట్లు ఇప్పటికే తేలింది. ఇంగ్లండ్‌లో ఉన్నత చదువులు చదువుతూ ఉన్న బాధితుడు ఇటీవలే కోల్‌కతాకి వచ్చాడు. అయితే ఇండియాకు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి తప్పించుకొని, ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో కూడా ఉండకుండా ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛగా బయట తిరిగేశాడు.

రెండు మూడు రోజులుగా దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా.. అతనికి కరోనా వైరస్ ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది. ఈ విషయం తెలియడంతో ఆ కరోనా పేషేంట్‌పై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. కానీ వ్యాధులను స్వాగతించే సమస్యే లేదని ఆమె అన్నారు. విదేశాల నుంచి వచ్చి జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు చేయించుకోకుండా తిరిగితే కనీసం 500 మందికి కరోనా వైరస్‌ సంక్రమించే అవకాశం ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారని ఆమె అన్నారు.

కరోనా బాధితుడి తల్లి కూడా రాష్ట్ర ప్రభుత్వ విభాగంలోని ఓ శాఖలో ఉన్నతాధికారి. రాష్ట్ర సచివాలయానికి ఆమె పలుమార్లు వెళ్లగా.. ఆ భవనంలోనే సీఎం కార్యాలయం కూడా ఉంటుంది. టెస్ట్‌లో అతడికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు అతడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయనున్నారు అధికారులు. అయితే అంతకుముందే అతడు మిత్రులతో కలిసి కోల్‌కతాలో పలు చోట్ల షాపింగ్ కూడా చేశాడు.