అరుణాచల్ ప్రదేశ్, అసోంలో భారీ భూకంపం

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 01:23 AM IST
అరుణాచల్ ప్రదేశ్, అసోంలో భారీ భూకంపం

ఈశాన్య భారత్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల తీవ్రతకు ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు సమాచారం. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న మయన్మార్‌, భూటాన్‌లో కూడా భూమి కంపించినట్లు సమాచారం. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టమేమీ జరగలేదు.

అటు ఫిలిప్పీన్స్ లో 24 గంటల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని సమర్ ద్వీపకల్పంలో భూమి కంపించింది. రాజధాని మనీలాకు 83 కిలోమీటర్ల దూరంలో సమర్ ద్వీపకల్పం ఉంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. సోమవారం(ఏప్రిల్ 22,2019) నాడు సంభవించిన భూకంపంలో 16 మంది చనిపోయారు. 30 మంది అదృశ్యం అయ్యారు. సోమవారం లూజాన్ సిటీలో భూకంపం తర్వాత వరుసగా 400 సార్లు స్వల్పంగా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు రిక్టర్ స్కేల్ పై రికార్డయ్యింది. వాటి తీవ్రత స్వల్పమే కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. అదే సమయంలో సమర్ ద్వీపకల్పంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప తాకడికి బొడెగా పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు.