అమ్మకానికి ఎయిరిండియా

అమ్మకానికి ఎయిరిండియా

కొంచెంకొంచెంగా వాటాలు అమ్మేస్తున్న ఎయిరిండియా వంద శాతం ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ గురువారం వెల్లడించారు. రూ.50వేల కోట్ల భారం మోయలేక భారీ నష్టాలను చవిచూస్తున్న ఎయిరిండియాను అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే ఈ ప్రక్రియపై చర్చలు మొదలయ్యాయి. ఫలితంగా పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైంది. ఈ మేర ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం(ఏఐఎస్ఏఎమ్) పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 

‘భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఏఐఎస్ఏఎమ్ వంద శాతం అమ్మేందుకు సిద్ధమైంది’ అని రాష్ట్ర మంత్రి లోక్‌సభలో వివరించారు. సఎయిరిండియా 2018-19 సంవత్సరానికి రూ.8వేల 556.35కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్‌పోర్టులు, పరికరాలు కొనుగోలు కోసం వచ్చే ఐదేళ్లలో రూ.25వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది’ కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. 

నష్టాల నుంచి తప్పుకోవడానికే ప్రైవేటీకరణకు అప్పజెప్పినట్లు మంత్రుల కథనం. ప్రైవేట్ చేతులకు అప్పగిస్తే విమాన ఛార్జీలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. భారత్‌లో ప్రధాన విమాన సర్వీసుగా ఉన్న ఎయిరిండియా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ చేతులకు వెళ్తుండటంతో అందరి కళ్లూ దానిపైనే ఉన్నాయి.