డిసెంబర్ లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

డిసెంబర్ లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

gst-collections-at-all-time-high-of-over-rs-1-15-lakh-crore-in-April-20201

GST collections డిసెంబర్-2020లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) కొత్త రికార్డును సృష్టించాయి. ఎన్నడూ లేనివిధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. 2017, జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికమని ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. 2019, డిసెంబరుతో పోలిస్తే ఈసారి ఏకంగా 12శాతం పెరిగాయి. కాగా, 2019 ఏప్రిల్ నెలలో వసూలైన రూ.1,13,866 కోట్లే ఇప్పటి వరకు అత్యధికంగా ఉండేవి.

మరోవైపు, ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూళ్లు రూ.ల‌క్ష కోట్లు దాట‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. క‌రోనా త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ శ‌ర‌వేగంగా కోలుకోవ‌డం, జీఎస్టీ ఎగ‌వేత‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల వ‌ల్ల ఈ భారీ వ‌సూళ్లు సాధ్య‌మైన‌ట్లు ఆర్థికశాఖ తెలిపింది. అలాగే జీఎస్టీ వ్యవస్థలో ఉన్న లోపాల్ని సవరించడంతో అవకతవకలకు ఆస్కారం తగ్గిందని.. అది కూడా వసూళ్ల పెరుగుదలకు ఓ కారణమని వెల్లడించింది. దేశీయ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆదాయాల కంటే వ‌స్తువుల దిగుమ‌తి వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ‌గా ఉంది.

డిసెంబర్‌ నెల వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,365 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.27,804 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.57,426 కోట్లు (దిగుమతులపై పన్ను ద్వారా రూ.27,050 కోట్లతో కలిపి) వసూలయ్యాయి. దీంతో పాటు సెస్‌ కింద మరో రూ.8,579 కోట్ల(రూ.971 కోట్ల దిగుమతి సుంకంతో కలిసి) మేర సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, ఐజీఎస్టీ నుంచి 23,276 కోట్లను సీజీఎస్టీ, 17,681 కోట్లను ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. అన్ని సర్దుబాట్ల తర్వాత డిసెంబరు నెలలో కేంద్రానికి రూ.44,641 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.45,485 కోట్ల ఆదాయం సమకూరింది.